రాజకీయ, భౌగోళిక సవాళ్లు ఎదురైనప్పుడు ఆందోళనకు లోనుకావద్దని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే ఇన్వెస్టర్లకు సూచించారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భయాలకు లోనుకాకుండా వ్యవహరించవలసిందిగా సలహా ఇచ్చారు. దేశీయంగా ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత సవాళ్లు సద్దుమణిగేవరకూ వేచిచూడమని సూచించారు. దీర్ఘకాలంలో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్ నిఫ్టీ పటిష్టత కొనసాగుతుందని, తద్వారా భారత్ వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని తెలియజేశారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50.. 30 వసంతాల వేడుక సందర్భంగా పాండే ఇన్వెస్టర్లకు పలు సూచనలు ఇచ్చారు.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయంగా స్టాక్ మార్కెట్లు అత్యధికస్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నట్లు పేర్కొన్నారు. కీలక నౌకా మార్గాలలో ఎదురవుతున్న అవాంతరాల కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం ఏర్పడుతున్నట్లు తెలియజేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ సరఫరాలమధ్య సమతౌల్యం దెబ్బతింటున్నట్లు వివరించారు.


