అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశీయంగా వాణిజ్య ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఫలితంగా ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే ముంబయిలో 20 శాతం హోటళ్లు మూసివేశారు. పరిస్థితి చక్కబడకపోతే మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని హోటళ్లు స్తంభించే ప్రమాదం ఉంది.
నగరాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితి
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏఆర్) అధ్యక్షుడు విజయ్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే నగరంలోని 20% హోటళ్లు మూతపడ్డాయి. మరో రెండు రోజుల్లో సరఫరా పునరుద్ధరించకపోతే కనీసం 50% రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,950 పలుకుతుండటం అదనపు భారంగా మారింది.
సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందనే పుకార్ల మధ్య బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్పందించింది. ప్రస్తుతానికి రెస్టారెంట్లు తెరిచే ఉంటాయని, అయితే అనిశ్చితిని తట్టుకోవడానికి పనివేళలు తగ్గించాలని, మెనూలో వంటకాలను పరిమితం చేయాలని సూచించింది.
హైదరాబాద్‌లో గ్యాస్ పంపిణీదారులు ఉన్నస్టాక్‌ను రేషనింగ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఇక పంజాబ్‌లో ఎల్పీజీ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేశాయి. జైపూర్‌లో వెడ్డింగ్ క్యాటరింగ్ సేవలకు కనీసం 7 రోజుల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.
అసలు కారణం ఏమిటి?
భారతదేశం ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుండగా అందులో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి రావాల్సిన 85-90 శాతం దిగుమతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న పరిమిత స్టాక్‌ను గృహ వినియోగానికి, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మళ్లిస్తుండటంతో వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది.
రంగంలోకి చమురు మంత్రిత్వ శాఖ
వాణిజ్య ఎల్పీజీ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఓఎంసీల ద్వారా సరఫరా పునరుద్ధరణను పర్యవేక్షించనుంది.
ఆతిథ్య రంగం కేవలం ఆహార అవసరాలనే కాక లక్షలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగితే అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు


