కెరీర్‌లో 101వ సింగిల్స్ టైటిల్ నెగ్గిన సెర్బియా దిగ్గజం
ఏథెన్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన మాజీ నంబర్‌వన్
హార్డ్ కోర్టులపై 72వ టైటిల్‌తో కొత్త రికార్డు
ఏథెన్స్ (గ్రీస్): ఈ ఏడాది రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ విఫలమైనా... సీజన్‌ను మాత్రం సింగిల్స్ టైటిల్‌తో ముగించాడు. ఏథెన్స్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ చాంపియన్‌గా అవతరించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 4–6, 6–3, 7–5తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించాడు.
తద్వారా తన కెరీర్‌లో 101వ సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ముసెట్టిపై జొకోవిచ్‌కిది తొమ్మిదో విజయం కావడం విశేషం. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
తొలి సర్వీస్‌లో 61 పాయింట్లకుగాను 43 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 36 పాయింట్లకుగాను 21 పాయింట్లు గెలిచాడు. టైటిల్ ఖాయమైన వెంటనే ఈ సెర్బియా స్టార్ తన జెర్సీని చించేసి విజయగర్జన చేశాడు. విజేత జొకోవిచ్‌కు 1,16,690 యూరోల (రూ. 1 కోటీ 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఏటీపీ ఫైనల్స్ టోర్నీకి దూరం
వరుసగా రెండో ఏడాది సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు జొకోవిచ్ దూరమయ్యాడు. ఏథెన్స్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత జొకోవిచ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘భుజం గాయంతో బాధపడుతున్నాను. అందుకే ఏటీపీ ఫైనల్స్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నా’ అని గతంలో ఏడుసార్లు ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను గెలిచి జొకోవిచ్ తెలిపాడు. జొకోవిచ్ స్థానంలో లొరెంజో ముసెట్టి ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆడనున్నాడు.
72 హార్డ్ కోర్టులపై జొకోవిచ్ సాధించిన టైటిల్స్. 71 టైటిల్స్‌తో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు.
2 పురుషుల టెన్నిస్ చరిత్రలో సింగిల్స్ టైటిల్ నెగ్గిన రెండో అతిపెద్ద వయస్కుడిగా జొకోవిచ్ (38 ఏళ్ల 5 నెలలు) నిలిచాడు. ఈ రికార్డు కెన్ రోజ్‌వెల్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న ఉంది. 1977లో కెన్ రోజ్‌వెల్ 43 ఏళ్ల వయసులో హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు.


