
యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో సెర్బియా దిగ్గజం
క్వార్టర్ ఫైనల్లో అమెరికా స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌పై విజయం
కెరీర్‌లో 53వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లోకి
ఫైనల్లో చోటు కోసం అల్‌కరాజ్‌తో ‘ఢీ’
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్... యూఎస్ ఓపెన్‌లో తన విజయపరంపరను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–3, 7–5, 3–6, 6–4తో గత ఏడాది రన్నరప్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. టేలర్ ఫ్రిట్జ్‌తో ఇప్పటి వరకు ఆడిన 11 సార్లూ జొకోవిచే నెగ్గడం విశేషం.
ఫ్రిట్జ్‌తో 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ పది ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 22 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్న జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ 12 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 42 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రిట్జ్‌పై గెలుపుతో జొకోవిచ్ కెరీర్‌లో 53వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకున్నాడు.
ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు సెమీఫైనల్‌కు చేరిన ప్లేయర్‌గానూ జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. 19వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 14వ సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టి జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. యూఎస్ ఓపెన్‌లో నాలుగుసార్లు చాంపియన్‌గా, ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ ఈ టోర్నీలో 11వ వసారి ఫైనల్ చేరుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది.
సెమీఫైనల్ పోరులో రెండో ర్యాంకర్ అల్‌కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–3తో అల్‌కరాజ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఈ టోర్నీలో అల్‌కరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా అల్‌కరాజ్ సెమీఫైనల్ చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అల్‌కరాజ్ 6–4, 6–2, 6–4తో 20వ ర్యాంకర్ జిరీ లెహెస్కా(చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు.
సబలెంకాకు ‘వాకోవర్’
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) వరుసగా ఐదో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా ప్రత్యర్థి, 2023 వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ‘వాకోవర్’తో సబలెంకా సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.
మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో 45 ఏళ్ల వీనస్ విలియమ్స్ (అమెరికా)–లేలా ఫెర్నాండెజ్ (కెనడా) ద్వయం 1–6, 2–6తో టాప్ సీడ్ టేలర్ టౌన్‌సెండ్ (అమెరికా)–సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. 1997 తర్వాత యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్–4 సీడింగ్ జోడీలు సెమీఫైనల్ చేరుకోవడం విశేషం.
1 అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న ప్లేయర్‌గా జొకోవిచ్ (53 సార్లు) రికార్డు సృష్టించాడు. అమెరికా మహిళా స్టార్ క్రిస్ ఎవర్ట్ (52 సార్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు.
14 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకోవడం జొకోవిచ్‌కిది 14వ సారి. ఈ టోర్నీలో అత్యధికసార్లు సెమీఫైనల్ చేరుకున్న జిమ్మీ కానర్స్ (అమెరికా; 14 సార్లు) రికార్డును జొకోవిచ్ సమం చేశాడు.
7 ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సెమీఫైనల్ చేరుకోవడం జొకోవిచ్‌కిది ఏడోసారి కావడం విశేషం. అంతేకాకుండా ఒకే సీజన్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగానూ జొకోవిచ్ (38 ఏళ్ల 94 రోజులు) గుర్తింపు పొందాడు.