
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా అవతరించేందుకు ప్రయత్నిస్తున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకు వేశాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈ మాజీ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత ఏడాది మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన ఏడో సీడ్ ఈసారి మాత్రం సాధికారిక ఆటతో టైటిల్‌పై గురి పెట్టాడు.
గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో ఓవరాల్‌గా 64వ సారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించిన జొకోవిచ్... యూఎస్ ఓపెన్‌లో 14వ సారి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో 38 ఏళ్ల జొకోవిచ్ ఒకే ఏడాది అన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కనీసం క్వార్టర్ ఫైనల్ చేరిన అతి పెద్ద వయస్కుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.
న్యూయార్క్: కెరీర్‌లో 19వ సారి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ దూసుకెళ్తున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 1 గంట 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 12 ఏస్‌లతో అదరగొట్టిన జొకోవిచ్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం.
నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చిన అతను 15 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్న మాజీ చాంపియన్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ కేవలం 20 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు జాన్ లెనార్డ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలతో డీలా పడ్డాడు.
‘ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. ఇదే జోరును మున్ముందు కొనసాగిస్తానని నమ్మకంతో ఉన్నా’ అని నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించి, ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ వ్యాఖ్యానించాడు.
ఇక క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్, గత ఏడాది రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో జొకోవిచ్ తలపడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ 6–4, 6–3, 6–3తో టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ అల్‌కరాజ్ (స్పెయిన్), ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అల్‌కరాజ్ 7–6 (7/3), 6–3, 6–4తో ఆర్థర్ రిండర్‌నీచ్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–3, 6–2, 6–1తో లియాండ్రో రీడి (స్విట్జర్లాండ్)పై నెగ్గారు.
రిబాకినాకు షాక్
మహిళల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ప్రపంచ 60వ ర్యాంకర్, 2023 వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 5–7, 6–2తో 2022 వింబుల్డన్ విజేత, ప్రపంచ 10వ ర్యాంకర్ రిబాకినాను ఓడించి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొండ్రుసోవా 13 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్), బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–1, 6–4తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై, క్రెజికోవా 1–6, 7–6 (15/13), 6–3తో టేలర్ టౌన్‌సెండ్ (అమెరికా)పై గెలుపొందారు. టౌన్‌సెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రెజికోవా రెండో సెట్‌లో ఏకంగా 8 మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కడం విశేషం. క్వార్టర్ ఫైనల్స్‌లో వొండ్రుసోవాతో సబలెంకా; క్రెజికోవాతో జెస్సికా పెగూలా (అమెరికా) తలపడతారు.