
పురుషుల సింగిల్స్ విజేతతోపాటు మహిళల సింగిల్స్ చాంపియన్‌కూ ఒకే పరిమాణమున్న ట్రోఫీ అందజేయనున్న యూఎస్ ఓపెన్ నిర్వాహకులు
న్యూయార్క్: కొన్నాళ్ల కిందట గ్రాండ్‌స్లామ్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని సమం చేసిన నిర్వాహకులు ట్రోఫీల్లో మాత్రం అంతరాలు చూపుతున్నారు. కానీ ఇకమీదట సమానత్వం పాటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కొన్ని మార్పులతో జరుగుతున్న సంగతి తెలిసిందే. సింగిల్స్ స్పెషలిస్టులు, టాప్‌స్టార్లతో మిక్స్‌డ్ డబుల్స్ నిర్వహించారు. ఇప్పుడు మహిళల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీని కూడా పురుషుల సింగిల్స్ విజేతకు దీటుగా ప్రదానం చేయనున్నారు. దీంతో మహిళలకు ‘మినియేచర్’ (చిన్న పరిమాణంలో) ట్రోఫీలనే విమర్శలకు ఈ యూఎస్ ఓపెన్‌తో తెరపడనుంది.
రోలాండ్ గారోస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అమెరికన్ స్టార్ కోకో గాఫ్ తాను అందుకున్న ట్రోఫీపై ఓ టిక్‌టాక్ రీల్ కూడా చేసింది. వివక్షాపూరితమైన ట్రోఫీ సైజ్ వీడియోను ఏకంగా 20 లక్షలకు పైగా వీక్షించారు. వ్యంగ్యంగా ఆమె పెట్టిన వీడియోకు అప్పట్లో లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఒకే టోర్నీ... ఒకే వేదిక... ఒకే ఈవెంట్ (సింగిల్స్)... అయినప్పుడు ట్రోఫీల్లో వ్యత్యాసమేంటనే చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీతో ఆ లింగ వివక్ష ట్రోఫీకి కాలం చెల్లనుంది.
వైరల్ వీడియోతో వార్తల్లో నిలిచిన కోకో గాఫ్ ఇప్పుడు ట్రోఫీ పరిమాణం సమానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సాధారణంగా పురుషుల ట్రోఫీతో పోల్చితే ఏడున్నర అంగుళాలు చిన్నగా ఉండే మహిళల ట్రోఫీ ఇకపై సరితూడే సమానం అయ్యింది. దీనిపై యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గర్వంగా ప్రకటించుకున్నారు. లింగ సమానత్వం మా డీఎన్‌ఏలోనే ఉందని టోర్నీ డైరెక్టర్ స్టేసీ అలెస్టెర్ చెప్పుకొచ్చారు.