అల్‌కరాజ్‌ ‘సిక్సర్‌’ | Carlos Alcaraz wins sixth Grand Slam title of his career | Sakshi
Sakshi News home page

అల్‌కరాజ్‌ ‘సిక్సర్‌’

Sep 9 2025 4:05 AM | Updated on Sep 9 2025 4:05 AM

Carlos Alcaraz wins sixth Grand Slam title of his career

కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన స్పెయిన్‌ స్టార్‌

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ హస్తగతం

ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సినెర్‌పై విజయం

రూ. 44 కోట్ల 11 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

రెండేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌లోకి  

న్యూయార్క్‌: మూడు నెలల వ్యవధిలో మూడోసారి చిరకాల ప్రత్యర్థులు కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), యానిక్‌ సినెర్‌ (ఇటలీ) మధ్య ‘గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌’ సమరం... ప్రతి పాయింట్‌కూ హోరాహోరీ తప్పదని... ఐదు సెట్‌ల పోరు ఖాయమని అభిమానులు భావించారు. కానీ అల్‌కరాజ్‌ అలాంటి అవకాశం ఇవ్వలేదు. 2 గంటల 42 నిమిషాల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సినెర్‌ను 6–2, 3–6, 6–1, 6–4తో ఓడించి రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 

విజేత అల్‌కరాజ్‌కు 50 లక్షల డాలర్లు (రూ. 44 కోట్ల 11 లక్షలు), రన్నరప్‌ సినెర్‌కు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 5 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో అల్‌కరాజ్‌ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ అందుకున్నాడు. ఇప్పటికే అల్‌కరాజ్‌ రెండుసార్లు చొప్పున ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2024, 2025), వింబుల్డన్‌ (2023, 2024), యూఎస్‌ ఓపెన్‌ (2022, 2025) టైటిల్స్‌ నెగ్గాడు.  

రెండు బ్రేక్‌ పాయింట్లతో... 
ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఐదు సెట్‌లలో సినెర్‌ను ఓడించిన అల్‌కరాజ్‌... వింబుల్డన్‌ టోర్నీ ఫైనల్లో నాలుగు సెట్‌లలో సినెర్‌ చేతిలో ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఓపెన్‌ తుదిపోరుపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ చేరిన అల్‌కరాజ్‌ తొలి గేమ్‌ నుంచే తన జోరు కనబరిచాడు. రెండో గేమ్‌లో, ఏడో గేమ్‌లో సినెర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. 

రెండో సెట్‌లో సినెర్‌ పుంజుకున్నాడు. నాలుగో గేమ్‌లో అల్‌కరాజ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను గెల్చుకున్నాడు. ఇక మూడో సెట్‌లో అల్‌కరాజ్‌ అసాధారణ ప్రదర్శన ముందు సినెర్‌ తేలిపోయాడు. 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అల్‌కరాజ్‌ ఆ తర్వాత ఒక గేమ్‌ కోల్పోయి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌ పోటాపోటీగా సాగినా ఐదో గేమ్‌లో సినెర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

2 అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌ మొదలయ్యాక (1973లో) ఒకే సీజన్‌లో రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ను ఓడించిన రెండో ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు రాఫెల్‌ నాదల్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2008లో నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ టోర్నీ ఫైనల్స్‌లో నాటి నంబర్‌వన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)పై గెలిచి విజేతగా నిలిచాడు.

2 జాన్‌ బోర్గ్‌ (స్వీడన్‌ –7 టైటిల్స్‌) తర్వాత 23 ఏళ్ల లోపే ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన రెండో ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ (22 ఏళ్ల 111 రోజులు) నిలిచాడు.

1 మూడు వేర్వేరు కోర్టులపై (హార్డ్, క్లే, గ్రాస్‌)  రెండుసార్లు చొప్పున గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన అతిపిన్న  వయస్కుడిగా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు.

6 అల్‌కరాజ్‌ కెరీర్‌లో నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌. ఓపెన్‌ శకంలో (1968 నుంచి) కనీసం ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడా కారుల జాబితాలో స్టీఫెన్‌ ఎడ్బర్గ్‌ (స్వీడన్‌), బోరిస్‌ బెకర్‌ (జర్మనీ) సరసన అల్‌కరాజ్‌ చేరాడు. ఈ జాబితాలో జొకోవిచ్‌ (24), నాదల్‌ (22), ఫెడరర్‌ (20), సంప్రాస్‌ (14), జాన్‌ బోర్గ్‌ (11), జిమ్మీ కానర్స్, ఇవాన్‌ లెండిల్, అగస్సీ (8 చొప్పున), విలాండర్, జాన్‌ మెకన్రో (7 చొప్పున) ముందున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement