
మరో గ్రాండ్‌స్లామ్ తుది పోరులో ఢీ
నేడు యూఎస్ ఓపెన్ ఫైనల్
రాత్రి 11.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
పురుషుల టెన్నిస్‌లో అసాధారణంగా సాగుతున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్ల వైరం మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరింది. వరల్డ్ నంబర్ 1 యానిక్ సినెర్, నంబర్ 2 కార్లోస్ అల్‌కరాజ్ యూఎస్ ఓపెన్‌లో తుది పోరుకు అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన తొలి సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను అల్‌కరాజ్ అలవోకగాఓడించగా... మరో సెమీస్‌లో ఆగర్ అలియసిమ్‌పై సినెర్ విజయం సాధించాడు. ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ సినెర్, అల్‌కరాజ్‌ల మధ్యనే జరుగుతుండటం విశేషం.
న్యూయార్క్: క్లే కోర్టు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్‌కరాజ్ గెలుపు... గ్రాస్ కోర్టు వింబుల్డన్ ఫైనల్లో విజేత సినెర్... ఇప్పుడు హార్డ్ కోర్ట్‌లో చాంపియన్ ఎవరో నేడు తేలనుంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ (ఇటలీ), అల్‌కరాజ్ (స్పెయిన్) ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్లో అల్‌కరాజ్ 6–4, 7–6 (7/4), 6–2తో జొకోవిచ్ (సెర్బియా)పై ఘన విజయం సాధించాడు. 2 గంట 23 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో అల్‌కరాజ్ ముందు 38 ఏళ్ల జొకోవిచ్ నిలవలేకపోయాడు. 31 విన్నర్లు కొట్టిన అల్‌కరాజ్ 7 ఏస్‌లు సంధించాడు.
రెండో సెమీ ఫైనల్లో సినెర్ 6–1, 3–6, 6–3, 6–4తో 25వ సీడ్ అలియసిమ్ (కెనడా)ను ఓడించాడు. 3 గంటల 21 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అలియసిమ్ గట్టి పోటీనిస్తూ ఒక సెట్ గెలవడంలో సఫలమైనా...చివరకు సినెర్‌దే పైచేయి అయింది. సినెర్ 11 ఏస్‌లు కొట్టగా, ఆగర్ 9 ఏస్‌లు బాదాడు.
నువ్వా, నేనా...
పురుషుల టెన్నిస్‌ను 24 ఏళ్ల సినెర్, 22 ఏళ్ల అల్‌కరాజ్ శాసిస్తున్నారు. ఓపెన్ ఎరా చరిత్రలో ఒకే సీజన్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్‌కు చేరిన తొలి జోడీగా వీరిద్దరు గుర్తింపు పొందారు. గత తొమ్మిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో ఎనిమిదింటిని వీరిద్దరే పంచుకున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల మధ్య 14 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అల్‌కరాజ్ 9–5తో ముందంజలో ఉన్నాడు.
యూఎస్ ఓపెన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 2022 క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరు తలపడ్డారు. ఏకంగా రికార్డు స్థాయిలో 5 గంటల 15 నిమిషాల పాటు సాగిన పోరులో అల్‌కరాజ్ గెలిచాడు. నాటినుంచే గ్రాండ్‌స్లామ్‌లో ఇద్దరి వైరం మొదలైంది. తాజా ఫామ్‌ను చూసుకుంటే 2025లో రెండు గ్రాండ్‌స్లామ్‌లు (ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్) సినెర్ ఖాతాలో చేరగా, ఫ్రెంచ్ ఓపెన్‌ను అల్‌కరాజ్ గెలుచుకున్నాడ
ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అల్‌కరాజ్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. సినెర్ వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లోనూ ఫైనల్ చేరిన ఘనతను నమోదు చేశాడు. రాడ్ లేవర్, ఫెడరర్ (3 సార్లు), జొకోవిచ్ (3 సార్లు) తర్వాత ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా సినెర్ నిలిచాడు. ప్రస్తుత టోర్నీలో అల్‌కరాజ్ పూర్తి స్థాయిలో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించగా...సినెర్ సెమీస్‌లో గాయంతో కాస్త తడబడ్డాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉంటే మరో అద్భుత పోరును చూడొచ్చు.
మళ్లీ వస్తా: జొకోవిచ్
25వ గ్రాండ్‌స్లామ్ సాధించేందుకు పట్టు వదలకుండా పోరాడుతున్న దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సెమీస్‌లో అల్‌కరాజ్ ముందు 38 ఏళ్ల జొకోవిచ్ నిలవలేకపోయాడు. 2025 సీజన్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలోనూ సెమీ ఫైనల్ వరకు వచ్చిన సెర్బియా స్టార్ ఆట అక్కడే ముగిసింది. సెమీస్‌లలో వరుసగా జ్వెరెవ్, సినెర్ (2 సార్లు), అల్‌కరాజ్ చేతుల్లో అతను ఓడాడు. అయితే తాను ఇంకా ఆశలు కోల్పోలేదని, పోరాటం ఆపనని అతను స్పష్టం చేశాడు.
‘గ్రాండ్‌స్లామ్‌ల వేటలో నేను ఆగిపోవడం లేదు. కనీసం మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసమైనా నా పోరాటం కొనసాగిస్తాను. ఇది కష్టమైన పని అని అందరికీ తెలుసు. సెమీస్‌లో తొలి రెండు సెట్‌ల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నాలో సత్తువ తగ్గిపోయింది. తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్న ఒక కుర్రాడితో తలపడుతున్నప్పుడు ఈ వయసులో అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా సరైంది కాదు.
సినెర్, అల్‌కరాజ్ లాంటి ప్లేయర్లతో 5 సెట్‌లు ఆడటం కష్టంగా మారిపోయింది. అయితే ఈ పోటీని నేను ఇష్టపడుతున్నా. మైదానంలో అభిమానుల మద్దతు, ఆ ఉత్సాహం వల్లే నేను ఇంకా ఆడగలుగుతున్నా’ అని జొకోవిచ్ చెప్పాడు.