కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తున్న క్రమంలో ఇప్పటి వరకూ ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా లేదా అనధికారికంగా అనుసరిస్తున్న పలు ప్రక్రియలు ఇప్పుడు అధికారికంగా ఒకే రకంగా ప్రామాణీకరణ చెందుతున్నాయి. అలాంటి ప్రక్రియల్లో ఒకటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ (FnF).
ఉద్యోగులు రాజీనామా చేసినప్పుడు లేదా వారిని యాజమాన్యాలు తొలగించిన సందర్భంలో గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, శాలరీ బకాయిలు, బోనస్, ఇన్సెంటివ్‌లు, పీఎఫ్/ఈఎస్ఐ సంబంధిత ఏర్పాట్లు వంటి అనేక చట్టబద్ధ సెటిల్మెంట్లు ఉంటాయి. వీటిని ఇప్పటి వరకూ కొన్ని కంపెనీలు ఉద్యోగుల సర్వీస్ కాలం ముగింపు రోజే అంటే చివరి పనిదినమే చెల్లిస్తుండగా మరికొకొన్ని కంపెనీలు 30 రోజుల చట్టబద్ధమైన కాలపరిమితిలో చెల్లించేవి.
ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగుల ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ డబ్బును రెండు పనిదినాల్లో చెల్లించాలి. ఈ విషయంలో గందరగోళం లేకుండా యాజమాన్యాలన్నీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరించేలా కేంద్ర కార్మిక శాఖ ప్రామాణీకరిస్తోంది. అయితే గ్రాట్యుటీ చెల్లింపునకు మాత్రం విడిగా కాల వ్యవధి ఉంటుంది.
కాగా 2026 ఏప్రిల్ 1 లోపు నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోందని, కొత్త కార్మిక నిబంధనలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అమలు చేయడానికి ఇదే కాలక్రమాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించిందని కార్మిక కార్యదర్శి వందన గుర్నానీ తెలిపారు.
కొత్త నిబంధన వల్ల ఉద్యోగులకు ప్రయోజనాలు
ఉద్యోగి రాజీనామా చేసిన వెంటనే రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ రావడంతో కొత్త ఉద్యోగానికి మారుతున్నవారికి లేదా మధ్యలో గ్యాప్ తీసుకున్నవారికి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
కంపెనీలు ఏదైనా కారణం చెప్పి సెటిల్‌మెంట్ ఆలస్యం చేయడం ఇక సాధ్యం కాదు. మోసాలు, అన్యాయాలపై నియంత్రణ పెరుగుతుంది.
సెటిల్‌మెంట్ ఆలస్యం కారణంగా వచ్చే వివాదాలు, కేసులు తగ్గుతాయి.
ఇది చదివారా? ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?
కంపెనీలపై ప్రభావం
హెచ్ఆర్ & ఫైనాన్స్ ప్రక్రియలలో కఠినమైన క్రమశిక్షణ అవసరమౌతుంది. రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ చేయాలంటే హెచ్ఆర్ ఎగ్జిట్ ఫార్మాలిటీలను వేగంగా పూర్తి చేయాలి. ఫైనాన్స్ టీమ్ వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ మేరకు సిస్టమ్‌లు ఆటోమేటెడ్ కావాలి.
రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ పెద్ద కంపెనీలకు సమస్య కాకపోయినా చిన్న, మధ్య తరహా సంస్థలు వెంటనే చెల్లింపుల కోసం క్యాష్ రిజర్వులు ఉంచుకోవాల్సి ఉంటుంది. లేబర్ కోడ్ ఉల్లంఘనకు జరిమానాలు, లీగల్ ఇష్యూలు వస్తాయి. కాబట్టి కంపెనీలు తమ ఎస్వోపీలను అప్‌డేట్ చేయాలి.
- రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ చేయడానికి మాన్యువల్ ప్రాసెస్ కష్టసాధ్యమౌతుంది. ఫలితంగా ఆటోమేషన్, హెచ్‌ఆర్‌ఎంఎస్, పేరోల్ టూల్స్ డిమాండ్ పెరుగుతుంది.


