న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలు బుధవారం పార్లమెంట్‌లో ప్రాంగణంలోని మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(ఉద్ధవ్) తదితర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్‌లో చర్చించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని తీర్మానించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, విపక్షాల భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 1వ తేదీన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు.
లేబర్ కోడ్స్‌పైపత్రిపక్షాల నిరసన
కేంద్రం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్స్‌పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. వీటిని వెంటనే రద్దు చేయాలని తేల్చిచెప్పాయి. లేబర్ కోడ్స్ పట్ల విపక్షాలు బుధవారం పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన వ్యక్తంచేశాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్లకార్డులు ప్రదర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కారి్మకులకు కక్షగట్టిందని, కేవలం ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కొత్త లేబర్ కోడ్స్‌తో కారి్మకులకు, ఉద్యోగులకు నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. లేబర్స్ కోడ్స్‌ను ప్రియాంకా గాంధీ సైతం తప్పుపట్టారు.


