ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.
కేసు వివరాలు ఇలా..
దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్‌కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.
ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది.


