32 వేల మంది టీచర్ల కొలువులు భద్రం | Calcutta High Court Reinstates 32,000 West Bengal Primary Teachers Jobs | Sakshi
Sakshi News home page

32 వేల మంది టీచర్ల కొలువులు భద్రం

Dec 4 2025 4:59 AM | Updated on Dec 4 2025 4:59 AM

Calcutta High Court Reinstates 32,000 West Bengal Primary Teachers Jobs

కలకత్తా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించింది. వారి నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ బుధవారం తోసిపుచ్చింది. టీచర్ల నియామక పరీక్షలో విజయం సాధించలేని కొందరు అభ్యర్థుల కారణంగా మొత్తం వ్యవస్థ ప్రభావితం కావడానికి వీల్లేదని స్పష్టంచేసింది. 

పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఇప్పటిదాకా నిరూపణ కాలేదని పేర్కొంది. తొమ్మిదేళ్లపాటు టీచర్లుగా కొనసాగిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది. పరీక్షల్లో అక్రమాల కేసులో కొనసాగుతున్న విచారణను ఆధారంగా చేసుకొని వారి నియామ కాలను రద్దు చేయలేమని వివరించింది. సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వును సమర్థించేందుకు నిరాకరించింది. 

ఆ 32,000 మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుబాటు అవుతాయని తేల్చిచెప్పింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పు పట్ల బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. వేలాది మంది టీచర్ల కుటుంబాలకు న్యాయస్థానం గొప్ప ఓదార్పును ఇచ్చిందని పేర్కొన్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం తప్ప వారి ఉద్యోగాలను తొలగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో ఆలోచించి, తీర్పు ఇచ్చారని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement