ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఛాంపియన్స్‌గా పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఆదివారం దోహ వేదికగా బంగ్లాదేశ్-ఎ జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడో ఆసియాకప్ కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను పాక్ కైవసం చేసుకుంది.
ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఆరంభంలో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మాజ్ సదాకత్ (18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) , అరఫాత్ మిన్హాస్( 23 బంతుల్లో 4 ఫోర్లతో 25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ఆఖరిలో సాద్ మసూద్ (26 బంతుల్లో 38) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బంగ్లాదేశ్-ఎ బౌలర్లలో రిపన్ మోండల్ మూడు వికెట్లు పడగొట్టగా.. రకిబుల్ హసన్ రెండు, మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫర్ సక్లెయిన్ తలా వికెట్ సాధించారు.
స్కోర్లు సమం..
అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. చేజింగ్‌లో హబీబుర్ రెహమాన్ సోహన్(23) మెరుపు వేగంతో ఆడడంతో మ్యాచ్ త్వరగా ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాతే బంగ్లా వికెట్ల పతనం మొదలైంది.
53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రకిబుల్ హసన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24), అబ్దుల్ గఫర్(16) దూకుడుగా ఆడడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేల్చాలని అంపైర్‌లు నిర్ణయించారు.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మూడు బంతుల్లో రెండు వికెట్ల నష్టానికి 6 పరుగులకే చేసింది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌటైనట్లు పరిగణిస్తారు. అహ్మద్ డానియల్ మరోసారి అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
బంగ్లా నిర్ధేశించిన 7 పరుగుల లక్ష్యాన్ని పాక్ నాలుగు బంతుల్లో చేధించింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. ఓపెనర్ మాజ్ సదఖత్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన


