ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి జితేశ్ శర్మ సేన ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బారత జట్టు యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇందుకు ప్రధాన కారణంగా సూపర్ ఓవర్లో భారత జట్టు అనుసరించిన వ్యూహమే. దోహా వేదికగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీ తొలి సెమీ ఫైనల్లో భారత్-‘ఎ’- బంగ్లాదేశ్- ‘ఎ’ జట్లు శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
194 పరుగులు
బంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65)తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎస్‌ఎం మెహెరాబ్ (18 బంతులు 48 నాటౌట్), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 194 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో గుర్జప్‌నీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, సూయశ్ శర్మ, రమణ్‌దీప్ సింగ్, నమన్ ధిర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
సరిగ్గా అదే స్కోరు
ఇక భారీ లక్ష్య ఛేదనను భారత్ ఘనంగానే ఆరంభించింది. ఓపెనర్లులో వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో 38 పరుగులతో సత్తా చాటగా.. ప్రియాన్ష్ ఆర్య 23 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (7) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.
ఇలాంటి తరుణంలో కెప్టెన్ జితేశ్ శర్మ (23 బంతుల్లో 33), నేహాల్ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడు రమణ్‌దీప్ సింగ్ (17), అశుతోశ్ శర్మ (13) ఫర్వాలేదనిపించగా.. విజయానికి ఆఖరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. హర్ష్ దూబే మూడే పరుగులు తీశాడు.
సూపర్ ఓవర్‌లో..
దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అయితే, సూపర్ ఓవర్లో కెప్టెన్ జితేశ్ శర్మ, అశుతోశ్ శర్మ బ్యాటింగ్‌కు వెళ్లారు. ఓపెనర్లు వైభవ్, ప్రియాన్షులను కాదని వీరిని పంపిన యాజమాన్యం అందుకు బదులుగా భారీ మూల్యమే చెల్లించింది. జితేశ్ తొలి బంతికే బౌల్డ్ కాగా.. రెండో బంతికి అశుతోశ్ పెవిలియన్ చేరాడు. ఇక బంగ్లా సూయశ్ శర్మ బౌలింగ్‌లో ఒక పరుగు తీసి గెలుపు జెండా ఎగురవేసి.. ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో భారత్ అనుసరించిన వ్యూహంపై టీమిండియా మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-‘ఎ’ జట్టు కోచ్ అసలేం ఆలోచిస్తున్నాడంటూ సునిల్ జోషిపై మండిపడ్డాడు. వైభవ్ ఏం తప్పు చేశాడని బ్యాటింగ్‌కు పంపలేదంటూ ఫైర్ అయ్యాడు.
ఇప్పటికే కొంప మునిగింది కదా!
కామెంట్రీలో భాగంగా.. ‘‘ఇప్పటికీ భారత్-‘ఎ’ నాయకత్వ బృందం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇంకా తామేదో చేస్తున్నట్లు వారు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీనికి ఎందుకు బ్యాటింగ్‌కు పంపలేదు?
భారత్-‘ఎ’ హెడ్‌కోచ్ సునిల్ జోషి.. ఇప్పుడు డగౌట్‌లో కూర్చుకుని ఏం రాసుకుంటున్నాడు? ఇప్పటికే కొంప మునిగింది కదా!’’ అంటూ మణిందర్ సింగ్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా బంగ్లా చేతిలో ఓటమితో భారత్ నిష్క్రమించగా.. శ్రీలంకపై గెలిచి పాకిస్తాన్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య ఆదివారం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ -2025 టైటిల్ పోరు జరుగుతుంది. ఇందుకు దోహా వేదిక.
చదవండి: అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ


