ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత-‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్-‘ఎ’ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో జితేశ్ శర్మ సేన ఓటమిపాలైంది. దీంతో ఈ టీ20 ఈవెంట్లో కనీసం ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన దుస్థితి వచ్చింది.
బంగ్లా చేతిలో భారత్ ఓటమి
దోహా వేదికగా ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు (IND A vs BAN A) ‘సూపర్ ఓవర్’ ద్వారా భారత్‌ను ఓడించింది. సూపర్ ఓవర్లో ఆడిన 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన భారత్ ‘0’కే పరిమితం కాగా... బంగ్లాదేశ్ 1 పరుగు చేసి విజయాన్నందుకుంది.
వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హబీబుర్ రహమాన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.... మెహ్రాబ్ హుసేన్ (18 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు.
సరిగ్గా 194 పరుగులే
భారత బౌలర్లలో గుర్‌జీప్‌నీత్ సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 194 పరుగులే సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ (Jitesh Sharma- 23 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.
Top-class innings from Vaibhav Sooryavanshi! 💥
Watch India A take on Bangladesh A in the semi-final, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldAsiaCupRisingStars2025 pic.twitter.com/7rSQRproSI— Sony Sports Network (@SonySportsNetwk) November 21, 2025
నేహల్ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో భారత్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిపాన్ మోండోల్ (1/35) ఐదు పరుగులే ఇచ్చాడు.
విజయం కోసం ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన భారత్ తొలి 5 బంతుల్లో 12 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి హర్ష్ దూబే, వధేరా కలిసి కష్టంగా 2 పరుగులు పూర్తి చేశారు. అయితే కీపర్ అక్బర్ ఘోర వైఫల్యంతో భారత్‌కు మూడో పరుగు కూడా వచ్చింది.
సూపర్ ఓవర్లో అంతా తలకిందులు..
చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్ ఓవర్లో భారత జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా వైభన్ సూర్యవంశీని కాదని జితేశ్ శర్మ, రమణ్‌దీప్‌ల సింగ్‌లతో ఓపెనింగ్ చేయించింది. మోండోల్ వేసిన తొలి బంతికి జితేశ్, రెండో బంతికి అశుతోష్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ‘సున్నా’ వద్ద ముగిసింది.
వైభవ్‌ను ఎందుకు పంపలేదు?
ఆ తర్వాత తొలి బంతికి వికెట్ తీసిన సుయాశ్ శర్మ, తర్వాతి బంతిని వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సూపర్ ఓవర్లో అనుసరించిన వ్యూహంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విధ్వంసకర వీరుడైన వైభవ్‌ను ఓపెనర్‌గా ఎందుకు పంపలేదంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడ్డారు. భారత్ ఓటమికి ఒకరకంగా ఇదే ప్రధాన కారణమనే చర్చ లేవనెత్తారు.
ఓటమికి బాధ్యత నాదే
ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ జితేశ్ శర్మ స్పందించాడు. ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓటమికి బాధ్యత నాదే. సీనియర్ ఆటగాడిగా మ్యాచ్‌ను సరైన రీతిలో ముగించి ఉండాల్సింది.
నేర్చుకునే దశలో ఇదొక భాగమే కానీ.. ఓటమి కాదు. ఏదో ఒకరోజు ఈ జట్టులోని ఆటగాళ్లే భారత జట్టుకు ప్రపంచకప్ అందించవచ్చు. వాళ్ల ప్రతిభకు ఆకాశమే హద్దు. మాకు ఇదొక అనుభవం.
ఇక్కడ వికెట్ కీలక పాత్ర పోషించింది. ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో మాకు తెలుసు. అయితే, పందొమ్మిదో ఓవర్లో బంగ్లా బౌలర్ అద్భుతంగా బౌల్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. 20 ఓవర్ల ఆట మా నియంత్రణలోనే ఉంది. కానీ ఆఖర్లో చేదు ఫలితం వచ్చింది’’ అని జితేశ్ శర్మ పేర్కొన్నాడు.
డెత్ ఓవర్లలో మేము బెస్ట్
ఇక సూపర్ ఓవర్లో రెగ్యులర్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యలను పంపకపోవడంపై స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరు పవర్‌ప్లేలో మాస్టర్లు అని నాకూ తెలుసు. అయితే, డెత్ ఓవర్లలో నేను, అశుతోశ్, రమణ్ హిట్టింగ్ ఆడగలము. అందుకే సూపర్ ఓవర్లో మేమే బ్యాటింగ్‌కు వెళ్లాలని భావించాం. ఇది జట్టు నిర్ణయం. పూర్తిగా నా నిర్ణయం’’ అని జితేశ్ శర్మ స్పష్టం చేశాడు.


