బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు (పాత ఫొటో)
తమ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తిరస్కరించిందన్న వార్తలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఖండించింది. ఐసీసీ తమకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఐసీసీ హామీ ఇచ్చింది
‘‘మా విజ్ఞప్తిపై ఐసీసీ స్పందించింది. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌ల నేపథ్యంలో.. మా ఆటగాళ్ల భద్రత విషయంలో మేము లేవెనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. మ్యాచ్‌ల వేదికలను మార్చాలనే మా విజ్ఞప్తిపై కూడా బదులిచ్చింది.
మేము ఈ టోర్నమెంట్లో కొనసాగేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చింది. ఈ సమస్యలపై మా నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని బీసీబీతో కలిసి పనిచేస్తామని తెలిపింది. భద్రత విషయంలో మాతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది.
వరల్డ్‌కప్ ఆడతాం
టోర్నీలో కొనసాగే విషయమై మాకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఐసీసీతో పాటు ఈవెంట్ నిర్వహిస్తున్న వారితో మా బోర్డు ప్రొఫెషనల్‌గానే ముందుకు సాగుతుంది. వరల్డ్‌కప్‌లో మేము తప్పక పాల్గొంటాము.
ఇందుకు సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగేందుకు.. మా సమస్యకు సరైన పరిష్కారం వెదికేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏదేమైనా మా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం’’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.
ఆటగాడి తొలగింపు.. ఐపీఎల్ అక్కడ బ్యాన్!
కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదంలో ముదిరిన విషయం తెలిసిందే. మార్చి నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను తమ దేశంలో ప్రసారం చేయరాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని బంగ్లా సమాచార, ప్రసార శాఖమంత్రి నిర్ధారించారు. ఐపీఎల్‌నుంచి తమ దేశం ఆటగాడు ముస్తఫిజుర్ రహమాన్‌ను అనూహ్యంగా తప్పించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ కనిపించరాదని నిర్ణయించింది.
అంతేకాదు.. తమ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు ఉన్నాయంటూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్‌నుంచి శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి శనివారం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో పంచాయితీ ఐసీసీ వద్దకు చేరింది. టోర్నీకి నెలరోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వేదికలు మార్చడం కుదరని బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు బుధవారం వార్తలు వచ్చాయి.
అందుకే యూటర్న్?
ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి వైదొలగానుకున్నా ఫర్వాలేదని చెప్పినట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్లు వెల్లడించాయి. అయితే, బీసీబీ మాత్రం వీటిని ఖండిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో.. టోర్నీ నుంచి తప్పుకొంటామని ముందుగా బెదిరింపు ధోరణి అవలంబించిన బీసీబీ.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని భావించి యూటర్న్ తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ముఖం మీద కొట్టినట్లు.. యువీ దెబ్బకు అల్లాడినా.. నాలో కసి పెరిగి...


