ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు స్టువర్ట్ బ్రాడ్. టెస్టుల్లో ఏకంగా 604 వికెట్లు కూల్చి.. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 178 వన్డే, 65 అంతర్జాతీయ టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.
ఇంతటి గొప్ప రికార్డు కలిగి ఉన్న స్టువర్ట్ బ్రాడ్‌కు కెరీర్ ఆరంభంలోనే ఓ చేదు అనుభవం ఎదురైంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007లో టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) బ్రాడ్‌కు పీడకల మిగిల్చాడు. అతడి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది.. అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
21 ఏళ్ల వయసులో..
మరోవైపు.. ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 క్రికెట్‌లో యువీ ఐకానిక్ ఫీట్ నమోదు చేసిన ఆ సమయంలో.. ఈ రైటార్మ్ పేసర్ వయసు 21 ఏళ్లే. అయితే, ఆ చేదు అనుభవం నుంచి బ్రాడ్ త్వరగానే కోలుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి మేటి బౌలర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
యువీ దెబ్బకు అల్లాడినా..
తాజాగా... గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టువర్ట్ బ్రాడ్.. యువీ దెబ్బకు అల్లాడినా.. ఆ తర్వాత ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పుకొచ్చాడు. ‘‘అప్పటికి నేను ఏడు నుంచి ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడి ఉంటాను. ఇంకా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రమే చేయలేదు. అప్పుడు నా జట్టు పొడవుగా.. బంగారు వర్ణంలో ఉండేది.
ఐదేళ్ల కెరీర్ సేవ్ అయింది
20-21 ఏళ్ల మధ్య వయసు. ఉరకలెత్తే ఉత్సాహం. అలాంటపుడు ఊహించని విధంగా.. నా ముఖం మీద కొట్టినట్లుగా బ్యాటర్ బాదుతూ ఉంటే నేను ఏమైపోవాలి?.. అయితే, ఆట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆరంభంలోనే అంతా సజావుగా సాగిపోతే 26-27 ఏళ్లకే అంతా సాధించేశాము అన్న భావన వచ్చేస్తుంది. అంకితభావం కొరవడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వారియర్ మోడ్
ఫామ్‌లో లేకుంటే జట్టు నుంచి తప్పించనూ వచ్చు. 31 ఏళ్లు వచ్చే సరికి అంతా ముగిసిపోతుంది. కానీ నాకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ నాలో కసిని రగిల్చింది. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో.. ఆటను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసేలా చేసింది. నన్ను ‘వారియర్ మోడ్’లోకి తీసుకువెళ్లింది.
ప్రతి మ్యాచ్‌కు ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా చేసింది. అలా 25-26 ఏళ్ల వయసు వచ్చే సరికి ఎలైట్ పర్ఫార్మర్ కావాలనే కోరిక పెరిగింది. అందకు తగినట్లుగా కృషి చేశా. కానీ ఒక్కోసారి నా శరీరం ఇందుకు సహకరించలేదు. కాబట్టి అనుకున్నది అనుకున్న సమయంలో సాధించకలేకపోయాను.
అందుకే ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేనింకా మెరుగ్గా ఆడాల్సింది అని అనిపిస్తుంది’’ అని మాథ్యూ హెడెన్ పాడ్‌కాస్ట్‌లో స్టువర్ట్ బ్రాడ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 344 మ్యాచ్‌లలో కలిపి 847 వికెట్లు కూల్చిన 39 ఏళ్ల బ్రాడ్.. 2023లో ఆటకు గుడ్‌బై చెప్పాడు.
చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్


