దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రీడలు బలి కావడం ఇటీవలికాలంలో ఎక్కువైపోయింది. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య బంధాలు బలపడటానికి దోహదపడతాయి. దురదృష్టవశాత్తు అలా జరగకపోగా, రాజకీయాలకు క్రీడలు బలైపోతున్నాయి. ఈ పోకడ జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో పతాక స్థాయికి చేరింది.
తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ బలైపోయింది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు అంపశయ్యపైకెక్కాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించింది. ప్రతిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడమని భీష్మించుకు కూర్చుంది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసుకుంది. ఈ చర్య-ప్రతి చర్యల పర్వం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. భారత్-బంగ్లాదేశ్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో క్రికెట్‌లో చోటు చేసుకున్న ఇలాంటి పరిణామాలపై ఓ లుక్కేద్దాం.
భారత్-పాక్
ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చేది భారత్-పాక్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోవడానికి పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు, రాజకీయాలు ప్రధాన కారణాలు. ఈ కారణాల చేత 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.
భారత్-బంగ్లాదేశ్
తాజాగా భారత్-బంగ్లాదేశ్ పరిస్థితి కూడా భారత్-పాక్ తరహాలో మారిపోతుంది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో, ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. వారు భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఓ మెట్టు పైకెక్కి వారి దేశంలో ఐపీఎల్‌ను కూడా బ్యాన్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ ఇలాగే ఓవరాక్షన్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం అసాధ్యం.
దీని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగదు. నష్టపోయేదంతా బంగ్లాదేశే. స్వదేశంలో ఐపీఎల్‌ను నిషేధించడం వల్ల కూడా భారత్‌కు పోయేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ ద్వారా వచ్చే రెవెన్యూ కోల్పోయి, ఆర్దికంగా బంగ్లాదేశే నష్టపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా బంగ్లాదేశ్ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీని వల్ల భారత్‌కు నష్టమేమీ ఉండదు కానీ, క్రికెట్ బలైపోతుంది.
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. రాజకీయం, ఉగ్రవాదం, అంతర్గత అస్థిరతలు, సరిహద్దు వివాదాల కారణంగా మొదటి నుంచి ఈ ఇరు దేశాల మధ్య క్రికెట్ నలిగిపోతూ వస్తుంది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడులకు తెగబడటంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఈ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది పౌరులు చనిపోవడంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌లో జరగాల్సిన టీ20 ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది.
పాకిస్తాన్-శ్రీలంక
2009లో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటిస్తుండగా.. లాహోర్‌లో ఆ జట్టు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఉదంతం తర్వాత చాలాకాలం పాటు శ్రీలంక పాక్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడిప్పుడే ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రోద్భలంతో పాక్‌లో పర్యటిస్తున్నా, లంక ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా
ఈ రెండు దేశాల మధ్య కూడా ఓ దశలో క్రికెట్ సంబంధాలు చెడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆఫ్ఘనిస్తాన్‌తో క్రికెట్ ఆడటం నిలిపి వేసింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ.. నష్టపోయింది మాత్రం క్రికెటే.
ఇంగ్లండ్-జింబాబ్వే
జింబాబ్వేలో మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అస్థిరత కారణంగా ఇంగ్లండ్-జింబాబ్వే మధ్య ఓ దశలో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2003 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జింబాబ్వేలో పర్యటించేందుకు నిరాకరించింది. నేటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.
సౌతాఫ్రికా-వెస్టిండీస్
1970ల్లో సౌతాఫ్రికాలో జాతి వివక్ష అధికంగా ఉండేది. ఆ సమయంలో ఆ దేశంతో క్రికెట్ సంబంధాలు కొనసాగించేందుకు ఏ దేశం ఇష్టపడలేదు. వెస్టిండీస్ ఓ అడుగు ముందుకేసి సౌతాఫ్రికాతో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. 1970–1991 మధ్యలో సౌతాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైంది.
ఇలా రాజకీయం, ఉగ్రవాదం, జాతి వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘన వంటి కారణాల చేత క్రికెట్ నలిగిపోయింది. అభిమానులు ఈ క్రీడ మజాను ఆస్వాదించలేకపోయారు. ఆటగాళ్ల కెరీర్‌లు నాశనమయ్యాయి. క్రికెట్ బోర్డులు ఆర్దికంగా నష్టపోయాయి.


