భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అదరగొట్టాడు. సౌతాఫ్రికాతో రెండో యూత్ వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. బెనోనీ వేదికగా ఆతిథ్య జట్టు బౌలర్లను ఓ ఆట ఆడుకున్న పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు.. మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు.
మరో ‘ఫాస్టెస్ట్’ రికార్డు
కేవలం పందొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా.. అఫ్గనిస్తాన్ స్టార్ ఒమర్జాయ్ సరసన నిలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన స్టీవ్ స్టాల్క్ (13 బంతుల్లో 2016లో), టీమిండియా ప్రస్తుత స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant- 18 బంతుల్లో 2018లో) ఈ ఇద్దరి కంటే ముందు వరుసలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డ మీద గతేడాది 52 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శతక్కొట్టాడు.
పది సిక్సర్లు
ఇక సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్‌లో మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 68 పరుగులు సాధించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌తో పాటు పది సిక్సర్లు ఉండటం విశేషం. కాగా అండర్–19 ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో యువ భారత జట్టు దుమ్మురేపడం సానుకూలాంశంగా పరిణమించింది.
8 వికెట్ల తేడాతో
వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన వైభవ్ సూర్య వంశీ సారథ్యంలోని భారత అండర్–19 జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో వన్డే సిరీస్ పట్టేసింది. బెనోనీలో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ – లూయిస్ పద్ధతి ప్రకారం) సౌతాఫ్రికాను చిత్తుచేసింది.
మొదట ఆతిథ్య జట్టు 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రౌల్స్ (113 బంతుల్లో 114; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... డానియల్ బోస్‌మన్ (31), అద్నాన్ (25) ఫర్వాలేదనిపించారు.
యువ భారత బౌలర్లలో కిషన్ సింగ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వెలుతురు లేమి కారణంగా ఆటకు అంతరాయం వాటిల్లింది. దీంతో యువ భారత్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174గా నిర్ణయించారు. ఛేదనలో ఆద్యంతం దూకుడు కనబర్చిన భారత్ 23.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
గీత దాటించడమే లక్ష్యం
వైభవ్ సూర్యవంశీ (24 బంతుల్లో 68; 1 ఫోర్, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతి ఎక్కడపడ్డా దాన్ని గీత దాటించడమే లక్ష్యంగా సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పటికే సీనియర్ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ దూకుడుతో లక్ష్యం వేగంగా కరిగిపోయింది.
మిగతా వారిలో అభిజ్ఞాన్ కుందు (42 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వేదాంత్ త్రిపాఠి (31 నాటౌట్; 4 ఫోర్లు), హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (20; 3 ఫోర్ల) ఫర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మిచెల్ క్రుస్‌కాంప్ 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం ఇక్కడే జరగనుంది.
చదవండి: నలిగిపోతున్న క్రికెట్
Vaibhav Suryavanshi as captain vs SA U-19:
10 Sixes & 1 four in the Innings.
14 years old and already terrifying bowlers. Scary talent. 🥶🇮🇳 pic.twitter.com/xUUEnaKGT2— Adarsh (@AdarshUniverse) January 5, 2026


