
ఏసీసీ చీఫ్ నఖ్వీ ట్రోఫీ డ్రామాపై బీసీసీఐ ఆక్షేపణ
ఏజీఎంలో తీవ్రస్థాయిలో అభ్యంతరం
దుబాయ్: ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడి వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మండిపడింది. మంగళవారం ఇక్కడ ఏసీసీ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. ఇందులో భారత బోర్డు తరఫున సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ కోశాధికారి ఆశిష్ షెలార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు కూడా అయిన ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ విపరీత ధోరణిపై బీసీసీఐ ప్రతినిధులిద్దరు ఆక్షేపించారు.
నఖ్వీ పాక్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో టీమిండియా అతని చేతుల మీదుగా జరగాల్సిన ట్రోఫీ ప్రదానోత్సవాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆదివారం రాత్రి తను ప్రదానం చేయలేదన్న అక్కసుతో నఖ్వీ తర్వాత కూడా విజేత భారత జట్టుకు పంపకుండా ఏసీసీ కార్యాలయంలోనే అట్టిపెట్టాడు. దీంతో ‘కప్’ లేకుండానే భారత క్రికెట్ జట్టు సభ్యులు స్వదేశానికి వచ్చారు.
మంగళవారం జరిగిన ఏజీఎంలో నఖ్వీ కొనసాగిస్తున్న ‘ట్రోఫీ డ్రామా’పై శుక్లా, షెలార్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది ఏసీసీ ట్రోఫీ. ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. టోర్నీలో గెలిచిన విజేత జట్టుకే అప్పగించాలి’ అని రాజీవ్ శుక్లా గట్టిగానే స్పష్టం చేశారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఏజీఎంలో ఇంత జరుగుతున్నా... భారత్ నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వెల్లువెత్తుతున్నా... ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ మాత్రం ఇంకా తన మొండి పట్టు వీడటం లేదు. ట్రోఫీని ఇచ్చేందుకు సమావేశంలో అంగీకరించలేదని తెలిసింది.
ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని నఖ్వీ దాటవేశారు. ఏసీసీ ఎజెండాలోని వైస్ చైర్మన్ ఎన్నిక వరకే ఈ మీటింగ్‌ను పరిమితం చేయాలని చూశారు. అంతేకాదు. వెస్టిండీస్‌పై నేపాల్ సంచలన విజయం పట్ల నేపాల్ జట్టును అభినందించారు. నేపాల్ ఆసియా జట్టు కావొచ్చు. కానీ ఆ ద్వైపాక్షిక సిరీస్ ఏసీసీకి సంబంధించిన టోర్నీ కానేకాదు. అయినా నేపాల్‌ను ప్రశంసించిన నఖ్వీ... ఏసీసీ సొంత టోర్నీ అయిన ఆసియా కప్ గెలిచిన భారత్‌ను మాటమాత్రంగానైనా అభినందించకుండా తన కుటిల బుద్ధిని చాటుకున్నారు. మొత్తానికి ఆసియా కప్ ట్రోఫీ మాత్రం ఇంకా ఏసీసీ కార్యాలయంలోనే ఉంది.