ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇప్పటి వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఇందుకు ప్రధాన కారణం.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ముఖాముఖి తలపడ్డాయి. ఈ క్రమంలో దాయాది దుశ్చర్యలకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు తొలుత లీగ్ దశలో.. పాక్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్ (No ShakeHand)కు నిరాకరించారు.
పప్పులు ఉడకవని తెలుసుకుని
దీనిని అవమానంగా భావించిన పాక్ బోర్డు.. టీమిండియాను నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేసింది. భారత్‌తో మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించాలంటూ రచ్చ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దిగిరాకపోవడంతో తమ పప్పులు ఉడకవని తెలుసుకుని మిన్నకుండిపోయింది.
అయితే, సూపర్-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. ఇందుకు ప్రతిగా పాక్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గన్ పేలుస్తున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వక్రబుద్ధి చాటుకున్నారు. ఇక ఫైనల్లోనూ దాయాది పాక్‌తో.. సెప్టెంబరు 28న తలపడిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది.
నఖ్వీ చేతుల మీదుగా తీసుకోము
నిబంధనల ప్రకారం తానే టీమిండియాకు ట్రోఫీ అందజేస్తానంటూ మొహ్సిన్ నఖ్వీ ముందుకు వచ్చాడు. అయితే, అతడు కేవలం పీసీబీ, ఏసీసీ చీఫ్ మాత్రమే కాకుండా.. పాక్ మంత్రి కూడా కావడంతో భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరించింది.
ఈ క్రమంలో ట్రోఫీతో పాటు.. మెడల్స్ కూడా తనతోపాటు ఎత్తుకెళ్లిన నఖ్వీ ఇంత వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల నఖ్వీకి ఇ-మెయిల్ పంపింది. ట్రోఫీ తమకు అప్పగించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఐసీసీ వద్దే పంచాయతీ తేలుతుంది
అయినప్పటికీ నఖ్వీ బుద్ధి మారలేదు. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తానని.. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్లను తన దగ్గరకు పంపించాలంటూ అహంకారం ప్రదర్శించాడు. దీంతో ఐసీసీ వద్దే పంచాయతీ తేల్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. నఖ్వీ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించాడని పేర్కొన్నాయి. ‘‘కొన్నిరోజుల క్రితం బీసీసీఐ అధికారి ఒకరు యూఏఈలో ఉన్న ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
మరింత దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..
ఏసీసీ ఆఫీస్‌లో ట్రోఫీ ఉందా అని ఆరా తీశారు. అయితే, స్టాఫ్ చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు. ట్రోఫీని ఇక్కడి నుంచి తరలించి.. అబుదాబిలో ఓ చోటు నఖ్వీ దాచిపెట్టాడని వాళ్లు చెప్పారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ట్రోఫీని ఎత్తుకెళ్లిన నఖ్వీ మరీ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదంటూ నెటిజన్లు అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది.
చదవండి: అతడు అదరగొట్టాడు.. కాబట్టి నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్


