అతడు అదరగొట్టాడు.. నితీశ్‌ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్‌ | Cant Play with this inept bowling: Kris Srikkanth Slams Team India star | Sakshi
Sakshi News home page

అతడు అదరగొట్టాడు.. కాబట్టి నితీశ్‌ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్‌

Oct 24 2025 2:40 PM | Updated on Oct 24 2025 3:20 PM

Cant Play with this inept bowling: Kris Srikkanth Slams Team India star

తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్‌... బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన... విజయావకాశాలు లభించినా సరే, కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరకు టీమిండియాకు నిరాశ తప్పలేదు. 

అడిలైడ్‌లో గురువారం ఆసక్తికరంగా సాగిన రెండో వన్డే (IND vs AUS)లో  ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో గిల్‌ సేనను ఓడించి.. సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.

రోహిత్‌, శ్రేయస్‌ అర్ధ శతకాలు వృథా
రోహిత్‌ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... అక్షర్‌ పటేల్‌ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. పేసర్‌ హర్షిత్‌ రాణా 18 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆసీస్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆడమ్‌ జంపా (Adam Zampa- 4/60) నాలుగు వికెట్లు పడగొట్టగా... బార్త్‌లెట్‌ 3, స్టార్క్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మాథ్యూ షార్ట్‌ (74; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్‌ కనోలీ (61 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు చేయగా, మిచెల్‌ ఒవెన్‌ (36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.

షార్ట్, కనోలీలదే కీలక పాత్ర
అయితే, ఛేదనలో ఆసీస్‌ కూడా కొంత ఇబ్బంది పడింది. 132/4 వద్ద భారత్‌కు పట్టు బిగించే అవకాశం వచ్చింది. కానీ.. షార్ట్, కనోలీ కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ మూడు వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ (Cooper Connolly) ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక బ్యాటింగ్‌లో కేవలం ఎనిమిది పరుగులే చేసి నిరాశపరిచిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి.. బౌలింగ్‌ పరంగానూ తేలిపోయాడు. మూడు ఓవర్లు బౌల్‌ చేసి ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ నితీశ్‌ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించాల్సింది. ఏదేమైనా తదుపరి సిడ్నీ వన్డేకు నితీశ్‌ రెడ్డిని తప్పిస్తారో లేదంటే ఇంకెవరిపైనైనా వేటు వేస్తారో తెలియదు.

అతడు అదరగొట్టాడు.. నితీశ్‌ రెడ్డిపై వేటు పడొచ్చు
నైపుణ్యం లేకుండా ఇలాంటి బౌలింగ్‌తో నితీశ్‌ రెడ్డి నిలదొక్కుకోలేడు. ఇలాగే ఉంటే బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను చితక్కొడతారు. బ్యాటింగ్‌లో సిక్సర్లు బాదడం వరకు సరే.. కానీ బౌలింగ్‌ పరంగానూ రాణించాలి కదా!

ఒకవేళ కావాలంటే హర్షిత్‌ను ఎనిమిది, కుల్దీప్‌ను తొమ్మిదో స్థానంలో ఆడించండి. హర్షిత్‌ ఈ వన్డేలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కానీ నితీశ్‌ నిరాశపరిచాడు. హర్షిత్‌ రెండు వికెట్లు కూడా తీశాడు. కాబట్టి అతడిని తప్పించలేరు.

అందుకే కుల్దీప్‌ను ఆడించాలంటే నితీశ్‌ రెడ్డిపై వేటు పడకతప్పకపోవచ్చని అనిపిస్తోంది’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా హర్షిత్‌ రాణా ఎంపికను తప్పుబడుతూ చిక్కా.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ యువ పేసర్‌ ప్రదర్శనకు ఫిదా అయి.. అతడిని ప్రశంసించడం గమనార్హం.

చదవండి: WTC: ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్‌ రాత.. టీమిండియాకు బూస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement