అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మార్ష్ సేన మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సొంతం చేసుకుంది. కాగా ఆసీస్ విజయంలో ఆ జట్టు యువ ఆటగాడు కూపర్ కొన్నోలీది కీలక పాత్ర.
లక్ష్య చేధనలో కొన్నోలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 132 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమంయలో కంగారులను షార్ట్‌తో కలిసి కూపర్ ఆదుకున్నాడు. షార్ట్ ఔటయ్యాక కూడా 22 ఏళ్ల యువ సంచలనం ఏ మాత్రం ఒత్తడికి లోనవ్వకుండా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఆఖరిలో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది.
కానీ కనోలీ ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న కొన్నోలీ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఒకవేళ కొన్నోలీ వికెట్‌ను టీమిండియా సాధించి ఉంటే కథ మరో విధంగా ఉండేది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కూపర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్ కెప్టెన్ మార్ష్ సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు.
కూపర్ ఒక అద్భుతం. అతడు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించగలడు. ఈ మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడు వయస్సు 22 ఏళ్లు మాత్రమే. ఖచ్చితంగా ఆసీస్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని మార్ష్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. కొన్నోలీ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు.
అయితే ఈ మ్యాచ్ కంటే ముందు అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా అతడు ఇప్పటివరకు కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ బిగ్ బాష్ లీగ్‌లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది.
చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?


