అత‌డే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇక‌నైనా మార‌వా? | India Lose Thriller In Adelaide By 2 Wickets, Fans Slam Gambhir for Dropping Kuldeep Yadav Again | Sakshi
Sakshi News home page

IND vs AUS: అత‌డే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇక‌నైనా మార‌వా?

Oct 24 2025 8:01 AM | Updated on Oct 24 2025 8:52 AM

Gambhirs Adelaide gamble backfires in series defeat as Kuldeep Yadav noise once again grows

అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 2 వికెట్ల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్‌... బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన క‌న‌బ‌రిచిన‌ప్ప‌టికి కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివ‌రికి భార‌త్‌కు నిరాశే మిగిలింది.

265 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే భార‌త బౌల‌ర్ల‌కు షాకిచ్చారు. స్టార్  ఓపెన‌ర్లు మిచెల్ మార్ష్‌(11), హెడ్‌(28) వెంట‌వెంట‌నే ఔట‌య్యారు. ఆ త‌ర్వాత మాథ్యూ షార్ట్‌(74), రెన్ షా(30) దూకుడుగా ఆడి భార‌త బౌల‌ర్ల‌పై ఒత్తిడి పెంచారు. రెన్ షా ఔట‌య్యాక బ్యాటింగ్‌కు వ‌చ్చిన అలెక్స్ క్యారీ(9) ఎక్క‌వసేపు క్రీజులో ఉండలేక‌పోయాడు. 

దీంతో  132/4 వద్ద భారత్‌కు పట్టు బిగించే అవకాశం వచ్చింది. అయితే షార్ట్, యువ ఆట‌గాడు కూపర్ కొన్నోలీ(61 నాటౌట్‌)  కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.

అంత‌కుముందు భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 264 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్‌ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...అక్షర్‌ పటేల్‌ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు.

గంభీర్ ప్లాన్ అట్ట‌ర్ ప్లాప్‌..
కాగా అడిలైడ్‌లో భార‌త్ ఒక వన్డే మ్యాచ్‌లో ఓడిపోవ‌డం ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో భార‌త తుది జ‌ట్టు ఎంపిక‌పై స‌ర్వాత్ర విమ‌ర్శ‌ల వ్య‌క్తమ‌వుతున్నాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ను ఆడించిక‌పోవ‌డాన్ని చాలా మంది త‌ప్పుబడుతున్నారు. గంభీర్ ఆల్‌రౌండ‌ర్ల వ్యూహాం బెడిసి కొట్టింది అని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. 

పిచ్ కండీష‌న్స్ త‌గ‌ట్టు ఆస్ట్రేలియా మెనెజ్‌మెంట్ ఒక‌ ఫాస్ట్ బౌల‌ర్‌ను ప‌క్క‌న పెట్టి స్పిన్న‌ర్‌ను తీసుకొస్తే.. భార‌త్ మాత్రం ముగ్గురు ఆల్‌రౌండ‌ర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌల‌ర్ల‌తో బ‌రిలోకి దిగింది. ఆసీస్ జ‌ట్టులోకి వ‌చ్చిన ఆడ‌మ్ జంపా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి ఏకంగా ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. 

అడిలైడ్‌లో పిచ్ పేస‌ర్ల‌తో పాటు స్పిన్న‌ర్ల‌కు కూడా అనుకూలిస్తుంది. ఇటువంటి వికెట్‌పై కుల్దీప్ బంతితో అద్భుతాలు చేయ‌గ‌ల‌డు. కానీ గంభీర్ మాత్రం వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో కూడా కుల్దీప్‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదు. బ్యాటింగ్ డెప్త్‌ను కారణంగా చూపుతూ.. మ్యాచ్ విన్న‌ర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే ప‌రిమితం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున ఆడిన‌ ముగ్గురు ఆల్‌రౌండ‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్ రాణించిన‌ప్ప‌టికి.. నితీశ్ కుమార్ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 

బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన నితీశ్‌.. బౌలింగ్‌లో కేవ‌లం 3 ఓవ‌ర్ల‌లోనే 24 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి కుల్దీప్ ఛాన్స్ ఇవ్వాల‌ని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కుల్దీప్ ప్ర‌స్తుతం సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాక‌ప్‌-2025లో అత‌డు  17 వికెట్లు తీసి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ సత్తాచాటాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆఖ‌రి వ‌న్డే అక్టోబ‌ర్ 25న సిడ్నీ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ ఆడే అవ‌కాశ‌ముంది.
చదవండి: IND vs AUS: ఏయ్.. ఏమి చేస్తున్నావు! శ్రేయ‌స్‌పై రోహిత్ సీరియ‌స్‌(వీడియో)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement