టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్‌గా గిల్ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదు
క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.
కానీ ఇక్కడ అలా కాదు
కానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్ మైండ్‌సెట్ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.
కనీసం ఒక్క హాఫ్ సెంచరీ
అయితే, శుబ్‌మన్ గిల్ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్‌లలో అతడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేయాలి.
లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్‌లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు.
వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనా
కాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్‌ను.. టీ20లలోనూ కెప్టెన్‌గా చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు
👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.
👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్
👉భారత్ స్కోరు: 175/6(20)
👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)
👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, ఒక వికెట్).
చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్


