భారత పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఓ పెద్ద తలకాయ ఒక్కో ఫార్మాట్‌లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు. బీసీసీఐ అండదండలు పూర్తిగా ఉన్న ఆ పెద్ద తలకాయ టీమిండియాలో చెప్పిందే వేదం. భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే.
అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు. అతడి ఆశీస్సులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్ అయిపోతాడు. భారత పురుషుల క్రికెట్‌ను శాశించే ఆ శక్తికి మరో పెద్ద తలకాయ మద్దతు కూడా ఉంది.
వీరిద్దరూ తలచుకుంటే అనర్హులను అందలమెక్కిస్తారు. అర్హుల కెరీర్‌లను అర్దంతరంగా ముగిస్తారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తారు. వారు చేసే ప్రతి పనికి వారి వద్ద ఓ సమర్దన స్క్రిప్ట్ ఉంటుంది. వారి జోలికి వెళ్లాలంటే మాజీలు, మాజీ బీసీసీఐ బాస్‌లు కూడా హడలిపోతారు. అంతలా వారు చెలరేగిపోతున్నారు.
వీరి ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి (డిసెంబర్ 9) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కటక్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అందరూ ఊహించిన విధంగానే శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతోనే టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన గిల్.. గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు సంపాదించాడు.
వాస్తవానికి గిల్ స్థానం సంజూ శాంసన్‌ది. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సౌతాఫ్రికా సిరీస్‌లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయితే గిల్ కోసం పైన చెప్పుకున్న పెద్ద తలకాయలు సంజూ కెరీర్‌ను బలి చేస్తున్నారు.
నేరుగా మెడపై కత్తి పెట్టకుండా తొలుత స్థానచలనం చేసి గేమ్‌ను మొదలుపెట్టారు. ఆతర్వాత ప్రణాళిక ప్రకారం జట్టులో స్థానాన్నే గల్లంతు చేస్తున్నారు.
ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది. రెండో టీ20 తర్వాత సంజూకు అవకాశమే ఇవ్వలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. సంజూను శాశ్వతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్దమవుతుంది.
ఓ దశలో సదరు పెద్ద తలకాయల్లో మొదటివాడు సంజూ కెరీర్‌కు పూర్తి భరోసా ఇచ్చినట్లు నటించాడు. 21 సార్లు డకౌటైనా తుది జట్టులో ఉంటావని నమ్మించాడు.
తీరా చూస్తే.. తన అనూనయుడికి అవకాశం ఇవ్వడం కోసం సంజూ కెరీర్‌నే బలి చేస్తున్నాడు. సదరు పెద్ద తలకాయకు తనకు సరిపోని ఆటగాళ్ల కెరీర్‌లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదు. దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతోనే మైండ్ గేమ్ ఆడాడు.
వారంతట వారే టెస్ట్, టీ20 కెరీర్‌లను అర్దంతరంగా ముగించుకునేలా చేశాడు. టీ20ల్లో గిల్ కోసం సంజూ కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ పెద్ద తలకాయ.. మరో అనర్హమైన బౌలర్ కోసం షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్‌ను అంపశయ్యపై పెట్టాడు. ఇకనైనా ఈ పెద్ద తలకాయ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ గౌరవం పోతుంది.


