టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్‌గా ఈ కేరళ బ్యాటర్ అదరగొట్టాడు. వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తూ.. టాపార్డర్‌లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.
విఫలమైనా..
అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్‌కు జోడీగా వస్తున్న గిల్ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్‌గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.
మరోవైపు.. గిల్ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కినా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్‌డౌన్‌లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్‌మెంట్ అతడిని బ్యాటింగ్‌కు పంపిస్తోంది.
సంజూపై వేటు వేసి.. జితేశ్‌కు చోటు
ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్‌మెంట్ తప్పించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్ శర్మను ఆడించింది.
ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.
గిల్‌కే పెద్దపీట వేస్తామన్న సూర్య
సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్‌లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.
నిజానికి సంజూ ఓపెనర్‌గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్ ఓపెనర్‌గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.
కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము
సంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.
టాపార్డర్‌లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్ ఆర్డర్‌లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది.
వరల్డ్‌కప్ ఆశలు ఆవిరేనా?
మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది.
చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!


