ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఇన్నింగ్స్ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.
తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.
ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు.
తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్),అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే


