సంజూ శాంసన్‌ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై! | Jitesh Sharma Breaks silence on WK Battle with Sanju Samson Ahead T20 WC | Sakshi
Sakshi News home page

సంజూ పెద్దన్న లాంటోడు.. టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!

Dec 10 2025 11:04 AM | Updated on Dec 10 2025 12:06 PM

Jitesh Sharma Breaks silence on WK Battle with Sanju Samson Ahead T20 WC

సంజూ శాంసన్‌.. భారత క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు చోటు దక్కినా.. వన్‌డౌన్‌లో... ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.

ఫలితంగా.. వికెట్‌ కీపర్‌ కోటాలో సంజూ శాంసన్‌ స్థానాన్ని జితేశ్‌ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో ఫినిషర్‌గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్‌ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!

వికెట్‌ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీట
ఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్‌ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా వికెట్‌ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్‌ శర్మ స్పందించాడు.

నాకు పెద్దన్న లాంటివాడు
‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.

సంజూ భయ్యా గొప్ప ప్లేయర్‌. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.

టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!
అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్‌ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్‌ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 

భారత్‌ ఘన విజయం
కాగా కటక్‌ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జితేశ్‌ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్‌లో భాగమై కీపర్‌గానూ సత్తా చాటాడు.

మరోవైపు.. ఓపెనర్‌ గిల్‌ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మెరుపు హాఫ్‌ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్‌)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. ​

చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement