సౌతాఫ్రికాతో రెండో టెస్టులో పాకిస్తాన్ (PAK vs SA 2nd Test) ఓటమి పాలైంది. రావల్పిండి వేదికగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు... ఆతిథ్య పాక్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC) సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన తొలి టెస్టులో పాక్ గెలిచి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. అయితే, గురువారం ముగిసిన రెండో టెస్టులో సఫారీల చేతిలో ఓడటంతో పాక్ ర్యాంకు పడిపోయింది.
బాబర్ ఆజమ్ అర్ధ శతకం
కాగా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో పాకిస్తాన్- సౌతాఫ్రికా ఇదే తొలి సిరీస్ కాగా.. ఇరు జట్లు చెరో విజయం ఖాతాలో వేసుకున్నాయి. ఇక గురువారం ఓవర్‌నైట్ స్కోరు 94/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ చివరకు 49.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది.
మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (87 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ధశతకం పూర్తిచేసుకున్న వెంటనే వెనుదిరగ్గా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. మొహమ్మద్ రిజ్వాన్ (18), సల్మాన్ ఆగా (28), నోమాన్ అలీ (0), షాహీన్ షా అఫ్రిది (0), సాజిద్ ఖాన్ (13) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మెర్ 6 వికెట్లతో అదరగొట్టగా... కేశవ్ మహరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరే కలిసి 17 వికెట్లు తీశారు. ఈ క్రమంలో హర్మెర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు.
రెండే వికెట్లు కోల్పోయి..
అనంతరం 68 పరుగులు లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రికెల్టన్ (25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్‌రమ్ (42; 8 ఫోర్లు) రాణించారు.
లక్ష్యం మరీ చిన్నది కావడంతో సఫారీ జట్టు ఎలాంటి తడబాటు లేకుండా రెండే వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో నోమాన్ అలీ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 404 పరుగులు చేసింది.
రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తోనూ ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సెనురన్ ముత్తుస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.
ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!
ఇక ఈ విజయంతో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్ రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. అదే విధంగా ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రీలంక మూడు నుంచి రెండుకు, టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుకున్నాయి.
డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు మ్యాచ్ గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే.. ఇరుజట్లకు నాలుగు పాయింట్లు.. టై అయితే ఆరు పాయింట్లు జమచేస్తారు.

అత్యధిక మ్యాచ్‌లు ఆడింది ఎవరంటే?
డబ్ల్యూటీసీ 2025-27లో ఆసీస్ జట్టు తొలుత వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అదే విధంగా.. శ్రీలంక.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒకటి డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్ గెలిచింది.
మరోవైపు.. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది టీమిండియా. తొలుత ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్న భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఓటమిపాలైంది.
ఇటీవల సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడిన టీమిండియా.. 2-0తో వైట్‌వాష్ చేసింది. తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా ద్వారా 52 పాయింట్లు సంపాదించింది.
ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్.. ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా 26 పాయింట్లు సాధించింది. అయితే, సౌతాఫ్రికా తాజాగా టాప్-5లోకి దూసుకురాగా.. ఇంగ్లండ్ ఆరో స్థానానికి పడిపోయింది.
చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?


