
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. సొంతగడ్డపై సౌతాఫ్రికా (Pak vs SA)తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై రాణించి.. పర్యాటక సఫారీ జట్టును 93 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.
రెండో స్థానానికి దూసుకువచ్చిన పాక్
ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ రెండో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటికి ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలవడం ద్వారా.. వందకు వంద విజయ శాతం నమోదుతో ఊహించని రీతిలో టాప్-2లోకి చేరుకుంది. ఇక ఈ పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.
ఆసీస్ వందకు వంద శాతం
డబ్ల్యూటీసీ 2025-27లో ఆసీస్ జట్టు తొలుత వెస్టిండీస్‌తో తలపడింది. విండీస్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసింది. ఇక మూడో స్థానంలో ఉన్న శ్రీలంక.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒకటి డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్‌లో గెలుపొందింది.
అత్యధిక మ్యాచ్‌లు ఆడింది టీమిండియానే.. అందుకే ఇలా
ఇక ఈ సీజన్‌లో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తొలుత ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్ సేన.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.
తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడిన టీమిండియా.. 2-0తో విండీస్‌ను వైట్‌వాష్ చేసింది. తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా ద్వారా 52 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్.. ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా 26 పాయింట్లతో టాప్-5లో నిలిచింది.
ఖాతా తెరవని విండీస్
కాగా ఈ సీజన్‌లో ఇప్పటికి ఐదు టెస్టులు ఆడిన వెస్టిండీస్ మాత్రం ఇంత వరకు గెలుపు ఖాతా తెరవలేదు. కనీసం ఒక్క మ్యాచ్‌నైనా డ్రా కూడా చేసుకోలేకపోయింది. దీంతో సున్నా పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ఇప్పటి వరకు న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ 2025-27 ప్రయాణం మొదలుపెట్టనే లేదు.
పాయింట్లు ఇలా
కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు వస్తాయి. ఒకవేళ ఇరుజట్ల మధ్య మ్యాచ్ డ్రా అయితే.. నాలుగు పాయింట్లు.. టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. ఇక 2017లో తొలిసారి డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టగా 2019 నాటి ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించి.. మొట్టమొదటి చాంపియన్‌గా అవతరించింది.
ఇక 2019-23 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాపై గెలుపొంది టైటిల్ సాధించగా.. 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఐసీసీ గద గెలుచుకుంది. ఇప్పటికి రెండుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న టీమిండియా.. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలోనైనా పని పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది.
పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు
👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్
👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్
👉పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 378
👉సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 269
👉పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 167
👉సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 183
👉ఫలితం: సౌతాఫ్రికాపై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.
PC: ICC
చదవండి: ఇప్పటికీ అవే వాడుతున్నాడు.. వాటిని అస్సలు మార్చడు: సూర్య