
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 (WTC 2025-27) సైకిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా (South Africa) ఓటమితో ప్రారంభించింది. ఈ సైకిల్‌లో వారి తొలి మ్యాచ్‌లో గత సైకిల్‌లో చివరి స్థానంలో నిలిచిన పాకిస్తాన్ (Pakistan) చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది.
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న సౌతాఫ్రికా లాహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా తలపడినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పాక్‌ను గట్టెక్కించింది. ఇరు జట్లలో ప్రధాన స్పిన్నర్లు అత్యుత్తమంగా రాణించారు. సౌతాఫ్రికా తరఫున సెనురన్ ముత్తుసామి, పాక్ తరఫున నౌమన్ అలీ 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు.
రాణించిన పాక్ బ్యాటర్లు.. ఆరేసిన ముత్తుసామి
ఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.
జోర్జి బాధ్యతాయుతమైన శతకం.. ఆరేసిన నౌమన్
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. నౌమన్ అలీ (6/112), సాజిద్ ఖాన్ (3/98) ధాటికి తడబడింది. టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో అతి కష్టం మీద 269 పరుగులు చేయగలిగింది. దీంతో పాక్‌కు అత్యంత కీలకమైన 109 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
పాక్‌ను మడతపెట్టిన ముత్తు
రెండో ఇన్నింగ్స్‌లో ముత్తుసామి మరోసారి (17-1-57-5) చెలరేగడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో మరో స్పిన్నర్ సైమన్ హార్మర్ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్ స్కోర్ కూడా కలుపుకుని పాక్ సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
చెలరేగిన నౌమన్, అఫ్రిది
ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆది నుంచే తడబడుతూ వచ్చింది. నౌమన్ అలీ (28-4-79-4) మరోసారి చెలరేగి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. అతనికి షాహీన్ అఫ్రిది (8.5-1-33-4), సాజిద్ ఖాన్ (14-1-38-2) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బ్రెవిస్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు (3 టీ20లు, 3 వన్డేలు) కూడా జరుగనున్నాయి.
చదవండి: గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు..