
ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఫలానా రంగు డ్రెస్ ధరిస్తే ఆరోజంతా మంచేనని కొందరు భావిస్తే.. మరికొందరు వివిధ వస్తువులను తమతో పెట్టుకోవడం ద్వారా అనుకున్న ఫలితాన్ని రాబట్టవచ్చని నమ్ముతూ ఉంటారు.
ముఖ్యంగా సెలబ్రిటీలు ఇలాంటి సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతుంటారు. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag).. ఎల్లప్పుడూ ఎరుపు రంగు రుమాలును తన వెంటే ఉంచుకునేవాడు. రెడ్ హ్యాండ్‌కర్చీఫ్‌ను అతడు తన లక్కీ చార్మ్‌గా భావించేవాడు. అంతకుముందు మోహిందర్ అమర్‌నాథ్, స్టీవ్ వా కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేవారు.
2022లో తొలిసారి గమనించా
టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కూడా ఇలాంటి ‘మూఢనమ్మకం’ ఒకటి ఉందట. భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. ‘‘శుబ్‌మన్ గిల్ గుడ్డిగా నమ్మే ఓ విషయం గురించి చెబుతాను. ఈ విషయం గురించి ఆసియా కప్ సమయంలోనూ ఎవరో నన్ను అడిగారు.

నేటికీ ఆ ప్యాడ్ల రంగును గిల్ మార్చలేదు
దీనిని నేను 2022లో తొలిసారి గమనించా. బహుశా ఆ ఏడాది లేదంటే మరుసటి సంవత్సరం నుంచో ఇది మొదలైనట్లుంది. జట్టులో అందరికంటే భిన్నమైన రంగులో ఉన్న ప్యాడ్లను గిల్ ధరిస్తాడు. అతడి ప్యాడ్స్ రంగు లేత నీలం రంగులో ఉంటుంది.
ఆ ప్యాడ్స్ ధరించిన నాటి నుంచి అతడు పరుగుల వరద కొనసాగిస్తూనే ఉన్నాడు. నేటికీ ఆ ప్యాడ్ల రంగును గిల్ మార్చలేదు. ఆసియా కప్ టోర్నీలోనూ అవే ధరించాడు. మా అందరి జెర్సీ ప్యాంట్ కలర్ ఒకేలా ఉంటుంది. కానీ అతడి ప్యాడ్స్ కలర్ మాత్రం డిఫరెంట్.
మూఢనమ్మకంగా మారిపోయింది కదా!
ఈ విషయం గురించి.. ‘సోదరా.. నీకిది ఒక మూఢనమ్మకంగా మారిపోయింది కదా!’ అని నేను చాలాసార్లు తనతో అన్నాను’’ అని సూర్యకుమార్ యాదవ్ సరదాగా వ్యాఖ్యానించాడు. న్యూస్24తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా సూర్య చివరగా ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఈ ఖండాంతర టోర్నీలో బ్యాటర్‌గా విఫలమైనా.. కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించాడు.
వన్డే సారథిగానూ
ఈ టోర్నీలో గిల్ సూర్యకు డిప్యూటీగా వ్యవహరించాడు. ఇక అంతకుముందే టీమిండియా టెస్టు కెప్టెన్ అయిన గిల్.. తాజా ఆస్ట్రేలియా పర్యటనతో వన్డే సారథిగానూ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా సూర్య స్థానాన్ని అతడు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత జట్టు ఆసీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డేల్లో గిల్, టీ20లలో సూర్య సారథ్యం వహిస్తారు.
చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ