టీ20, టెస్టు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి... కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కాంట్రాక్ట్‌ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 22న జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆటగాళ్ల కాంట్రాక్టులతో పాటు... మహిళల దేశవాళీ క్రికెట్ చెల్లింపుల విషయంలో ప్రధానంగా చర్చ సాగనుంది.
మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఏజీఎం ఇదే. ఇప్పటి వరకు కోహ్లి, రోహిత్ ‘ఏ ప్లస్’ కేటగిరీలో ఉండగా... ఇప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతున్న కారణంగా ఈ ఇద్దరినీ అందులో నుంచి తొలగించే అవకాశం ఉంది.
కొత్త ‘ఏ ప్లస్’ కాంట్రాక్టు జాబితాలో ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు... టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్‌మన్ గిల్ చోటు దక్కించుకోనున్నాడు. ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ ఏజీఎంలో మహిళల దేశవాళీలో టోర్నీల మ్యాచ్ ఫీజులు, అంపైర్లు, రిఫరీల జీతభత్యాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఇక బోర్డు డిజిటల్ సొత్తుకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. ప్రస్తుతం మిథున్ మన్హాస్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతుండగా... రఘురామ్ భట్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: జోరు కొనసాగించాలని...


