ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేయడంతో భారీగా రేటింగ్ పాయింట్లు సాధించి రెండు స్థానాలు ఎగబాకాడు.
గత వారం ర్యాంకింగ్స్‌లో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే సిరీస్‌లో రెండు మెరుపు అర్ద శతకాలు సాధించిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
రోహిత్‌కు విరాట్‌కు మధ్య కేవలం 7 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 773 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ ఏడాది రో-కో టాప్-2లో ముగిస్తారు. మిగతా భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 10వ స్థానంలో పడిపోయాడు.
సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 2 స్థానాలు ఎగబాకి 12వ ప్లేస్‌కు చేరుకోగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వరుసగా 99, 100 స్థానాల్లో నిలిచారు.
ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. డికాక్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి ఎగబాకగా.. మార్క్రమ్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 25వ స్థానానికి చేరాడు. బ్రీట్జ్కే ఓ స్థానం మెరుగుపర్చుకొని 29కి, బవుమా 3 స్థానాలు మెరుగుపర్చుకొని 37వ స్థానానికి చేరారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. రషీద్ ఖాన్, ఆర్చర్ టాప్-2 బౌలర్లుగా కొనసాగుతున్నారు. కుల్దీప్ మినహా టాప్-10లో ఒక్క భారత బౌలర్ కూడా లేడు.
రవీంద్ర జడేజా 16, సిరాజ్ 21, షమీ 23, అక్షర్ పటేల్ 33, వాషింగ్టన్ సుందర్ 81, హార్దిక్ పాండ్యా 95, వరుణ్ చక్రవర్తి 100 స్థానాలకు పడిపోగా.. అర్షదీప్ సింగ్ 29 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ స్థానానికి, హర్షిత్ రాణా 13 స్థానాలు మెరుగుపర్చుకొని 80వ స్థానానికి ఎగబాకారు.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్‌జాయ్, సికందర్ రజా, నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 10, 11 స్థానాల్లో ఉన్నారు.


