న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ | Big Blow New Zealand Pacer Suffers Shoulder Injury Taken To Hospital | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. అయ్యో పాపం.. ఇంత దారుణంగా..

Dec 10 2025 1:19 PM | Updated on Dec 10 2025 2:13 PM

Big Blow New Zealand Pacer Suffers Shoulder Injury Taken To Hospital

వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కివీస్‌ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌ (NZ vs WI)తో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్‌.. వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా తొలి టెస్టులో కివీస్‌ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

205 పరుగులకే ఆలౌట్‌
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. కివీస్‌ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్‌ అయింది.

నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్‌ 
విండీస్‌ ఓపెనర్లు జాన్‌ కాంప్‌బెల్‌ (44), బ్రాండన్‌ కింగ్‌ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్‌ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్‌ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్‌ టిక్నర్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్‌ రే మూడు వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు.. జేకబ్‌ డఫీ ఒక వికెట్‌ తీయగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) సైతం ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్‌ టెయిలెండర్‌ ఆండర్సన్‌ ఫిలిప్‌ (5) రనౌట్‌ రూపంలో కివీస్‌కు ఓ వికెట్‌ దక్కింది. ​

నొప్పితో విలవిల్లాడుతూ
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 66వ ఓవర్లో మైకేల్‌ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్‌ ఇమ్లాచ్‌ ఫైన్‌ లెగ్‌ దిశగా బాల్‌ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్‌ టిక్నర్‌ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.

ఏడ్చేసిన బౌలర్‌!
దీంతో కివీస్‌ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్‌ పరిస్థితి చూసి బౌలర్‌ మైకేల్‌ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్‌ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్‌ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్‌ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 7, డెవాన్‌ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్‌ కంటే కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్‌దే పైచేయి కాగా.. టిక్నర్‌ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. 

చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement