రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat kohli) ఖాతాలో మరో రికార్డు చేరింది. సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలవడంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో మరో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు.
సచిన్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉండగా.. విరాట్ ఖాతాలో 20వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు చేరింది. ఈ విభాగంలో విరాట్, సచిన్ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (17), జాక్ కల్లిస్ (14), సనత్ జయసూర్య (13), డేవిడ్ వార్నర్ (13) ఉన్నారు.
జయసూర్య రికార్డు సమం
ప్రత్యేకించి వన్డే క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్‌కు వన్డేల్లో ఇది 11వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో విరాట్ సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు.
జయసూర్య ఖాతాలోనూ 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్ చలామణి అవుతున్నాడు.
కాగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు శతకాలు (135, 102) సహా చివరి మ్యాచ్‌లో అజేయమైన అర్ద సెంచరీ (65) చేశాడు. ఈ ప్రదర్శనలకు గానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
జైస్వాల్ సూపర్ సెంచరీ.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
విశాఖ వేదికగా నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (106) సెంచరీ సాయంతో 270 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీ.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


