భారత క్రికెట్‌లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుకున్నాడనే అనుమానంతో యువ క్రికెటర్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కోచ్‌ను చితకబాది.. అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. పుదుచ్చేరి అండర్-19 క్రికెట్ కోచ్ వెంకటరామన్ (Venkataraman)కు తీవ్ర గాయాలయ్యాయి. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (CAP) పరిసరాల్లోనే ముగ్గురు స్థానిక క్రికెటర్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025)కి తమను ఎంపిక చేయకుండా.. సెలక్టర్లను ప్రభావితం చేశాడనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.
హత్యాయత్నం కింద నిందితులపై కేసు
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హత్యాయత్నం కింద నిందితులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్న వేళ.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు.
విరిగిన భుజం, ఇరవై కుట్లు
క్రికెట్ బ్యాట్‌తో కొట్టి వెంకటరామన్‌ను గాయపరిచారు. ఈ ఘటనలో అతడి భుజానికి (విరిగినట్లు అనుమానం), పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తలపై బలంగా కూడా కొట్టడంతో నుదుటిపై దాదాపు 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితులను కార్తికేయన్, అర్వింద్‌రాజ్, సంతోష్ కుమారన్‌గా గుర్తించినట్లు తెలిపారు.
అత్యంత హింసాత్మకంగా
ప్రస్తుతం అసోసియేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఉన్నవారి సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరామన్ తీవ్రంగా గాయపడ్డారని.. అత్యంత హింసాత్మకంగా అతడిపై దాడి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సదరు అధికారి పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.
కాగా ఈ ఘటనపై క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. కోచ్‌పై దాడి చేయడాన్ని పుదుచ్చేరి అసోసియేషన్ అధికారులు ఖండించారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ అనూహ్య పరిణామంతో సెలక్షన్ కమిటీలో కీలకంగా వ్యవహరించే ‘పెద్దలు’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రస్థాయి కోచ్‌లకు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
స్కామ్ చేశారా?
అయితే, సెలక్షన్ విషయంలో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ అవకతవలకు పాల్పడిందనే ఆరోపణలూ ఉన్నాయి. స్థానిక క్రికెటర్లను కాదని.. బయటి నుంచి వచ్చిన వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు జారీ చేయించేసి.. వాటి ద్వారా లోకల్ కోటాలో ఇతరులను ఎంపిక చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఈ కారణంగా రంజీ ట్రోఫీ 2021 సీజన్ నుంచి ఐదుగురు అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.
చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు


