
న్యూఢిల్లీ: ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీమ్‌కు అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఆదేశాల మేరకు ఇప్పటికీ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది.
ఈ విషయంపై దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏసీసీకి లేఖ రాసింది. ఏసీసీలోని సభ్య దేశాలైన శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు కూడా బీసీసీఐకి మద్దతు పలుకుతూ వెంటనే ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, రాజీవ్ శుక్లా లేఖ రాసిన విషయాన్ని ఏసీసీ అధికారి ఒకరు నిర్ధారించారు.
అయితే నఖ్వీ మాత్రం తన మొండితనాన్ని వీడలేదు. బీసీసీఐకి సంబంధించినవారు ఎవరైనా దుబాయ్‌కు వచ్చి తన చేతుల మీదుగా తీసుకుంటేనే దానిని అందిస్తామని అతడు పునరుద్ఘాటించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దాంతో ఆసియా కప్ ఫైనల్ రోజులాంటి యథాతథ స్థితి ఇంకా కొనసాగుతోంది.
నా చేతుల మీదుగా తీసుకోవచ్చు
బీసీసీఐ లేఖపై తాజాగా నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్ ఫైనల్ రోజు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్ చివరి క్షణం వరకు చెప్పలేదు. వేదికపై అతిథులంతా చేరిన తర్వాత ఆ విషయం తెలిసింది. మేం 40 నిమిషాలు వేచి చూసినా ఎవరూ రాలేదు. ఆసియా కప్ ట్రోఫీ భారత్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాబట్టి బీసీసీఐ ప్రతినిధి ఎవరైనా ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడు ఒకరితో కలిసి ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా తీసుకోవచ్చు’ అని అదే మాట చెప్పాడు. ఈ ప్రతిష్టంభనకు ఏసీసీలో పరిష్కారం లభించదని భారత బోర్డుకు అర్థమైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో నఖ్వీపై ఫిర్యాదు చేయాలని... అక్కడే ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.
చదవండి: పాకిస్తాన్ అవుట్