దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో నవంబర్ నెలలో ఆమె ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తుది జాబితాలో షఫాలీకి చోటు దక్కింది. భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలుపొందడంలో షఫాలీ కీలకపాత్ర పోషించింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆమె 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. ప్రతీక రావల్ గాయపడటంతో అనూహ్యంగా సెమీస్, ఫైనల్ ఆడే అవకాశం దక్కగా ఏకంగా ఆల్‌రౌండ్ షోతో భారత వరల్డ్‌కప్ స్టార్ అయ్యింది. తాజాగా అవార్డు రేసులోనూ ఉంది. ఆమెతో పాటు ఈ అవార్డు కోసం ఈషా ఒజా (యూఏఈ), తిపత్చా పుతవాంగ్ (థాయ్‌లాండ్)లు కూడా పోటీ పడుతున్నారు.
ఐసీసీ ప్రారంభించిన మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీలో (బ్యాంకాక్)లో వీళ్లిద్దరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గాను సఫారీ స్పిన్నర్ హార్మర్, బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లామ్, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ నవాజ్‌లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో ఉన్నారు. భారత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా నెగ్గడంలో హార్మర్ కీలక భూమిక పోషించాడు.


