నేడు వైజాగ్‌లో భారత్, దక్షిణాఫ్రికా చివరి వన్డే
గెలిచిన జట్టుకు దక్కనున్న సిరీస్ ∙ఉత్సాహంగా సఫారీలు, ఒత్తిడిలో భారత్
మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
భారత పర్యటనకు వచ్చిన ఏ విదేశీ జట్టయినా ఒకే టూర్‌లోని రెండు ఫార్మాట్ (టెస్టు, వన్డే)లలో మన టీమ్‌పై సిరీస్‌లు గెలుచుకోవడం 1986–87 తర్వాత మళ్లీ జరగలేదు. ఇప్పుడు అలాంటి మరో అవమానకర రికార్డును ప్రస్తుత భారత జట్టు నెలకొల్పే ప్రమాదం ఉంది. సఫారీల చేతుల్లో ఇప్పటికే టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా... ఇప్పుడు వన్డేల్లోనూ సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌లలో ఫలితాన్ని ‘టాస్’ శాసించడంతో ఈ సారైనా టాస్ గెలవాలని భారత్ కోరుకుంటోంది. మ్యాచ్ కూడా గెలిచి రాహుల్ బృందం సిరీస్‌ను సాధిస్తుందా అనేది చూడాలి.
సాక్షి, విశాఖపట్నం: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి రెండు వన్డేలు హోరాహోరీగా సాగాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు చేతికి సిరీస్ చిక్కుతుంది. గత రెండు మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పర్యటనలో లభిస్తున్న వరుస విజయాలు దక్షిణాఫ్రికా బృందంలో మరింత ఆత్మవిశ్వాసం పెంచగా... స్వదేశంలో వన్డే సిరీస్‌ను కాపాడుకోవాల్సిన ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది.
జైస్వాల్‌పై దృష్టి...
తొలి రెండు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు సాధించి కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండటం భారత్‌కు ప్రధాన సానుకూలాంశం. రోహిత్ తొలి మ్యాచ్‌లో చెలరేగగా, రుతురాజ్ గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. కెపె్టన్ రాహుల్ నిలకడైన ఆటతీరు కనబరుస్తున్నాడు. అయితే ఈ టాప్–5లో జైస్వాల్ ఒక్కడే విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఉంది.
జడేజా, సుందర్ కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేపోయారు. కుల్దీప్ ఫర్వాలేదనిపించగా, పేసర్లు హర్షిత్, అర్‡్షదీప్, ప్రసిధ్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసిధ్ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైనా... టీమ్‌లో మరో ప్రత్యామ్నాయ పేస్ బౌలర్ అందుబాటులో లేకపోవడంతో అతడినే కొనసాగించక తప్పని పరిస్థితి. బౌలర్ల ప్రదర్శన పేలవంగానే ఉంటుండటంతో భారత్ విజయావకాశాలన్నీ బ్యాటర్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి.
రెండు మార్పులతో...
359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రెండో వన్డే గెలవడం సఫారీల పట్టుదలకు నిదర్శనం. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా సరే... ఏ దశలోనూ జట్టు బ్యాటర్లు ఒత్తిడిని దరి చేరనీయలేదు. ప్రతీ ఒక్కరు పోరాడి సమష్టి ప్రదర్శనతో టీమ్‌ను విజయం వరకు తీసుకెళ్ళారు. మార్క్‌రమ్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా, బవుమా మిడిలార్డర్‌లో మూలస్థంభం.
రెండు వన్డేల్లోనూ విఫలమైన డికాక్ తన అనుభవంతో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ ఆశిస్తోంది. బ్రీట్‌కే, బ్రెవిస్, యాన్సెన్, బాష్ నిలకడగా ఆడుతుండటం జట్టుకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో కండరాల గాయంతో మధ్యలోనే తప్పుకున్న జోర్జి, బర్గర్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... వారి స్థానాల్లో బార్ట్‌మన్, రికెల్టన్ జట్టులోకి వస్తారు.
టాస్ గెలిచేనా!
సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో మంచు ప్రభావం చాలా కనిపించింది. రాత్రి సమయంలో బౌలింగ్ బాగా కష్టంగా మారిపోతోంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అనే పరిస్థితి వస్తోంది. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. అయితే ఈ విషయంలో చాలా కాలంగా భారత్‌ను దురదృష్టం వెంటాడుతోంది. భారత్ వరుసగా గత 20 వన్డేల్లో టాస్ ఓడిపోయింది! 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత భారత్ మళ్లీ టాస్ గెలవలేదు. ఈ సారైనా రాత మారుతుందా అనేది చూడాలి.


