పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ముక్కోణపు టీ20 సిరీస్
కాగా స్వదేశంలో శ్రీలంక- జింబాబ్వేలతో పాకిస్తాన్ ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్- శ్రీలంక (Pakistna vs Sri Lanka) ఫైనల్ చేరగా.. శనివారం (నవంబరు 29) రావల్పిండి వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లంక బ్యాటింగ్ చేసింది.
కుప్పకూలిన లంక బ్యాటింగ్ ఆర్డర్
ఓపెనర్ కామిల్ మిశారా (59) తప్ప మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. 19.1 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి లంక ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi), మొహమ్మద్ నవాజ్ చెరో మూడు వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) రెండు, సల్మాన్ మీర్జా, సయీమ్ ఆయుబ్ చెరో వికెట్ కూల్చారు.
రాణించిన పాక్ టాపార్డర్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (23), సయీబ్ ఆయుబ్ (36) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మిగిలిన వారిలో కెప్టెన్ సల్మాన్ ఆఘా(14)తో పాటు ఫఖర్ జమాన్ (3) విఫలమయ్యారు. అయితే, పవన్ రత్ననాయకే బౌలింగ్‌లో దసున్ షనక క్యాచ్ పట్టడంతో ఫఖర్ జమాన్ అవుట్ కాగా.. అంపైర్ నిర్ణయాన్ని ఫఖర్ వ్యతిరేకించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్‌లో ఈ మేరకు ఆన్‌ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా.. అతడితో వాగ్వాదానికి దిగాడు.
ఫఖర్ జమాన్ ఓవరాక్షన్.. షాకిచ్చిన ఐసీసీ
ఈ నేపథ్యంలో ఫఖర్ జమాన్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఫఖర్ జమాన్ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కాబట్టి ఓ మెరిట్ పాయింట్ మాత్రమే జత చేస్తున్నాం.
అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం పట్ల ధిక్కారం చూపినందుకు గానూ అతడికి శిక్ష విధిస్తున్నాం. అతడు కూడా తన తప్పిదాన్ని అంగీకరించాడు’’ అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలంలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే.. సదరు ప్లేయర్ తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం పడుతుంది.


