1297 మ్యాచ్‌ల తర్వాత సింగిల్ డిజిట్ స్కోరు చేసిన అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం
టొరంటో: లెబ్రాన్ జేమ్స్ ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ ప్రియులకు చిరపరిచితుడు! హాలీవుడ్‌లోని ‘జేమ్స్‌బాండ్ 007’ సిరీస్ సినిమాల్లాగే విజయవంతమైన సూపర్ బాస్కెట్‌బాలర్ లెబ్రాన్. అరంగేట్రం మొదలు ఇప్పటివరకు ఆడిన 1297 వరుస మ్యాచ్‌ల్లో అతను ప్రతీసారి కూడా పదుల సంఖ్యని మించే పాయింట్లు సాధించాడు. లెబ్రాన్ జేమ్స్ ఇన్నేళ్ల తర్వాత, వెయ్యిపైచిలుకు మ్యాచ్‌ల అనంతరం తొలిసారి సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాడు. బాగా ఆడి ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేమ్స్... ఈసారి బాగా ఆడలేక కూడా నిలవడమే ఈ వార్తకున్న విశేషం!
లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కు ఆడే ఈ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాలర్ టొరంటో రాప్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 8 పాయింట్లే చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాయింట్లు చేయడంలో వెనుకబడినప్పటికీ సహచరులకు పదేపదే స్కోరు చేసేందుకు సాయపడ్డాడు. దీంతో లేకర్స్ 123–120తో టొరంటో రాప్టర్స్‌పై గెలుపొందింది. 40 ఏళ్ల జేమ్స్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లో అలుపెరగని యోధుడు.
2003లో క్లీవ్‌లాండ్ కెవలియర్స్ తరఫున ఎన్‌బీఏలో అరంగేట్రం చేసిన ఈ పవర్ ఫార్వర్డ్ ప్లేయర్ తదనంతరం మయామి హీట్‌కు మారాడు. 2018 నుంచి లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని కెరీర్ మొత్తం హైలైట్స్ అంటే అతిశయోక్తి కాదు. 2005 నుంచి 2025 వరకు ఏకంగా 21 సార్లు ‘ఎన్‌బీఏ ఆల్ స్టార్స్’లో నిలిచాడు. 2012, 2013, 2016, 2020 ఈ నాలుగేళ్లు ఎన్‌బీఏ చాంపియన్‌గా, ఫైనల్స్‌లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా నిలిచిన ఘనత లెబ్రాన్ జేమ్స్‌దే!
‘ఫోర్బ్స్’ గణాంకాల ప్రకారం అతని నికర సంపద 1.3 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ. 11, 689 కోట్ల రూపాయలు! లెబ్రాన్ జేమ్స్ కుమారుడు బ్రోనీ జేమ్స్ కూడా బాస్కెట్‌బాల్ ప్లేయరే. లెబ్రాన్, బ్రోనీ ఇద్దరూ కలిసి గత సీజన్‌లో లాస్‌ఏంజెలిస్ లేకర్స్ తరఫున బరిలోకి దిగి ఎన్‌బీఏ మ్యాచ్ ఆడిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టించారు.


