
బిగ్‌బాష్ లీగ్‌లో మొదటిసారి నెగ్గిన హోబర్ట్ హరికేన్స్
ఎఫ్‌ఏ కప్‌లో 119 ఏళ్ల తర్వాత కప్పు గెలిచిన క్రిస్టల్ ప్యాలెస్
ఆర్‌సీబీ ఒక్కటే కాదు... మరో 11 జట్లకు ఈ సంవత్సరమే తొలి టైటిల్
ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు...అది క్రీడా రంగమైతే ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడతారు!ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు....అడ్డంకులను అధిగమిస్తూ గమ్యానికి చేరువవుతారు! సర్వశక్తులు ధారపోసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు...అయినా వెనకడుగు వేయకుండా ఎట్టకేలకు గెలుపు రుచి చూస్తారు!
తాజా ఐపీఎల్ ఫలితాన్ని విశ్లేషిస్తే ఈ విషయం అవగతమవుతుంది. లీగ్ ప్రారంభం నుంచి ట్రోఫీ చేజిక్కించుకోవడం కోసం తహతహలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్‌లో తమ కల నెరవేర్చుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లి ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో 11 జట్లు ఇలా తొలిసారి తమ ‘కప్పు కల’ను తీర్చుకున్నాయి. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరహాలో... ఆ్రస్టేలియాలోని బిగ్‌బాష్ టి20 లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్, చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ), ఎఫ్‌ఏ కప్‌లో క్రిస్టల్ ప్యాలెస్ జట్లు ఈసారే తొలి టైటిల్ సాధించాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ ఇలా వేర్వేరు ఆటల్లో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న జట్లపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం
90 ఏళ్ల తర్వాత...
బెల్జియంకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ రాయల్ యూనియన్ సెయింట్ గిల్లోయిస్ ఇప్పటి వరకు 12 టైటిల్స్ సాధించింది. అందులో 11 ట్రోఫీలను 1904 నుంచి 1935 మధ్య గెలుచుకున్న రాయల్ యూనియన్ 90 ఏళ్ల పోరాటం తర్వాత పన్నెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఒకదశలో ద్వితీయ డివిజన్‌కు పడిపోయిన ఆ జట్టు... తిరిగి పుంజుకొని విజయం సాధించడం విశేషం.
క్రిస్టల్ ప్యాలెస్... 119 ఏళ్ల తర్వాత!
ఐపీఎల్‌లో తొలి టైటిల్ గెలిచేందుకు బెంగళూరుకు 18 సీజన్లు ఎదురు చూడాల్సి వచ్చిందని అనుకుంటుంటే... ఫుట్‌బాల్ అసోసియేషన్ చాలెంజ్ కప్ (ఎఫ్‌ఏ కప్)లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టు 119 సంవత్సరాల తర్వాత తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. మే 17న జరిగిన ఫైనల్లో క్రిస్టల్ ప్యాలెస్ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ సిటీ జట్టును ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. శతాబ్దకాలంగా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... తమ జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చింది.
హోబర్ట్ హరికేన్స్ తొలిసారి...
ఆస్ట్రేలియా ప్రఖ్యాత టి20 టోర్నమెంట్ బిగ్‌బాష్ లీగ్ లో కొత్త విజేత అవతరించింది. 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ మొదటిసారి ట్రోఫీ ముద్దాడింది. జనవరి 27న జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌పై గెలిచి విజేతగా నిలిచింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (42 బంతుల్లో 108; 6 ఫోర్లు, 11 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హరికేన్స్ సునాయాసంగా గెలుపొందింది.
అదే బాటలో ఇండియానా పేసర్స్..
నేషనల్ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్‌బీఏ) లీగ్‌లో కూడా ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇండియానా పేసర్స్, ఒక్లాహోమా థండర్ సిటీ జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో టైటిల్ పోరు జరగనుంది. గతంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియానా పేసర్స్ జట్టు... ఈ ఏడాది చక్కటి ఆటతీరుతో ఎన్‌బీఏ ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి ఫైనల్లో ఇండియానా పేసర్స్ 111–110తో ఒక్లాహోమా సిటీ థండర్‌పై నెగ్గగా... ఆదివారం జరిగిన రెండో ఫైనల్లో ఒక్లాహోమా సిటీ థండర్ 123–107తో ఇండియానా పేసర్స్ జట్టును ఓడించింది. ఏడింటిలో తొలుత నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.
పీఎస్‌జీ 43 ఏళ్ల తర్వాత...
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. జూన్ 1న జరిగిన తుదిపోరులో పీఎస్‌జీ జట్టు 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై గెలుపొందింది. సుదీర్ఘ చరిత్రగల యూరోపియన్ కప్‌లో పీఎస్‌జీ జట్టుకు 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటి టైటిల్ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.
18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ...
టి20 ఫార్మాట్‌లో నిర్వహించిన తొలి ఐసీసీ ప్రపంచకప్ విజయవంతం కావడంతో ఆ మరుసటి ఏడాదే (2008)... ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి లీగ్‌లో పోటీ పడుతున్న ఆర్‌సీబీ జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్‌లో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు... క్వాలిఫయర్–1తో పాటు తుదిపోరులోనూ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లి ఎట్టకేలకు చాంపియన్ హోదా దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోహ్లి... కప్పును చేతబట్టి చిన్నపిల్లాడిలా సంబరాల్లో మునిగిపోవడం అభిమానులను ఎంతగానో అలరించింది.
అర్ధశతాబ్దం తర్వాత...
సుదీర్ఘ చరిత్ర ఉన్న బొలోగ్నా ఫుట్‌బాల్ క్లబ్... అర్ధశతాబ్దం తర్వాత కోపా ఇటాలియా కప్ చేజిక్కించుకుంది. మే 15న మిలాన్ వేదికగా జరిగిన తుదిపోరులో బొలోగ్నా జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏసీ మిలాన్ జట్టుపై గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రమాదకర జట్టుగా ముద్రపడ్డ బొలోగ్నా... ఎట్టకేలకు 51 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది.
1933 తర్వాత తొలిసారి...
నెదర్లాండ్స్‌లోని డెవెంటర్ నగరానికి చెందిన ‘గో అహెడ్ ఈగల్స్’ ఫుట్‌బాల్ జట్టు... సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఏడాది తమ తొలి టైటిల్ సాధించింది. 1920 నుంచి 1930 వరకు ప్రత్యర్థులను భయపెట్టిన ఈగల్స్... 1933 తర్వాత తొలి సారి డచ్ కప్ గెలుచుకుంది. ఏప్రిల్ 21న జరిగిన తుదిపోరు ‘షూటౌట్’లో ఈగల్స్ విజయం సాధించి కప్పు కల తీర్చుకుంది.
స్టుట్‌గార్ట్ 28 ఏళ్ల తర్వాత...
జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ వీఎఫ్‌బీ స్టుట్‌గార్ట్.. 28 ఏళ్ల తర్వాత డీఎఫ్‌బీ పోకల్ ఫైనల్లో విజేతగా నిలిచింది. మే 24న జరిగిన తుది పోరులో స్టుట్‌గార్ట్ 4–2 గోల్స్ తేడాతో అరిమినియా బీలెఫెల్డ్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో స్టుట్‌గార్ట్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన స్టుట్‌గార్ట్... మళ్లీ ఇన్నాళ్లకు తమ టైటిల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకుంది.
హ్యారీ కేన్‌కు మరింత ప్రత్యేకం...
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు స్టార్ హ్యారీ కేన్‌కు కూడా ఈ ఏడాది చాలా గొప్పగా సాగింది. కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన కేన్‌కు టైటిల్ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే ఈ ఇంగ్లండ్ స్ట్రయికర్ ఈ ఏడాది తన కప్పు కలను నెరవేర్చుకున్నాడు. బేయర్న్ మ్యూనిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... బుండెస్‌లిగా ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన కేన్... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
70 ఏళ్ల తర్వాత...
1955లో చివరిసారిగా ఎఫ్‌ఏ కప్ సొంతం చేసుకున్న న్యూ క్యాజిల్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్... ఏడు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు ఈ ఏడాది ఇంగ్లిష్ ఫుట్‌బాల్ లీగ్ కప్ గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 16న జరగిన తుదిపోరులో న్యూ క్యాజిల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో లివర్‌పూల్‌ను మట్టికరిపించి చాంపియన్‌గా అవతరించింది.
17 ఏళ్ల తర్వాత...
ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ టోటెన్‌హామ్ హాట్‌స్పర్... 17 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది యూరోపా లీగ్ ట్రోఫీ దక్కించుకుంది. మే 22న జరిగిన ఫైనల్లో టోటెన్‌హామ్ ఎఫ్‌సీ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ యునైటెడ్‌పై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది.