
సెమీఫైనల్ అవకాశాలకు తెర
150 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం
కొలంబో: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన రెండో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. సోమవారమే బంగ్లాదేశ్ నిష్క్రమించగా... ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. కొలంబోలో వాన బారిన పడిన మరో మ్యాచ్‌లో ఫాతిమా సనా సారథ్యంలోని పాక్ జట్టు చిత్తుగా ఓడింది. ఆ జట్టుకిది నాలుగో పరాజయం. మంగళవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 150 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.
వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే 2 ఓవర్లకే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత ఆట మళ్లీ మొదలు కాగా... మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది.
అన్ని వరల్డ్ కప్‌లలో కలిపి దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్ లారా వోల్‌వర్ట్ (82 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా... మరిజాన్ కాప్ (43 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూన్ లూస్ (59 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ (0) టోర్నీలో మూడోసారి డకౌటైన అనంతరం వోల్‌వర్ట్, లూస్ కలిసి రెండో వికెట్‌కు 93 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు.
చివర్లో డి క్లెర్క్ (16 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సఫారీ టీమ్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆఖరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 72 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సంధు, సాదియా ఇక్బాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలయ్యాక వాన కారణంగా పలు మార్లు అంతరాయం ఏర్పడటంతో మళ్లీ మళ్లీ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చింది. చివరకు పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు.
అయితే పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేయగలిగింది. సిద్రా నవాజ్ (22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ ఫాతిమా సనా రెండు పరుగులే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్ కాప్ 3 వికెట్లు పడగొట్టగా, షాంగసే 2 వికెట్లు తీసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన మరిజాన్ కాప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఇండోర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది.