breaking news
Ashish Shelar
-
అందుకే తెలంగాణకు వచ్చా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ శెలార్ శుక్రవారం భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్లో వీరి సమావేశం జరిగింది. సినిమా పరిశ్రమ (Film Industry) అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, రాచకొండ లాంటి ప్రాంతాలు సినిమా షూటింగ్స్కుు ఎంతో అనువైనవి మహారాష్ట్ర మంత్రికి కోమటిరెడ్డి వివరించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలు నిర్మిస్తారని,హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాలు సినిమాలు నిర్మించేందుకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్‌గా డెవలప్మెంట్ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) వివరించారు. సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సినీకార్మికుల సంక్షేమం లాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.కోమటిరెడ్డికి శెలార్ ఆహ్వానంసినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, మహారాష్ట్రలో కూడా ఇట్లాంటివి అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు ఆశిష్ శెలార్ (Ashish Shelar) వెల్లడించారు. మహారాష్ట్ర ఫిల్మ్ సిటీని సందర్శించాలని మంత్రి కోమటి రెడ్డిని ఆశిష్ శెలార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ -
ప్రదానం చేయలేదని.. ఎప్పటికీ పంపరా?
దుబాయ్: ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడి వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మండిపడింది. మంగళవారం ఇక్కడ ఏసీసీ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. ఇందులో భారత బోర్డు తరఫున సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ కోశాధికారి ఆశిష్ షెలార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు కూడా అయిన ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ విపరీత ధోరణిపై బీసీసీఐ ప్రతినిధులిద్దరు ఆక్షేపించారు. నఖ్వీ పాక్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో టీమిండియా అతని చేతుల మీదుగా జరగాల్సిన ట్రోఫీ ప్రదానోత్సవాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆదివారం రాత్రి తను ప్రదానం చేయలేదన్న అక్కసుతో నఖ్వీ తర్వాత కూడా విజేత భారత జట్టుకు పంపకుండా ఏసీసీ కార్యాలయంలోనే అట్టిపెట్టాడు. దీంతో ‘కప్’ లేకుండానే భారత క్రికెట్ జట్టు సభ్యులు స్వదేశానికి వచ్చారు. మంగళవారం జరిగిన ఏజీఎంలో నఖ్వీ కొనసాగిస్తున్న ‘ట్రోఫీ డ్రామా’పై శుక్లా, షెలార్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది ఏసీసీ ట్రోఫీ. ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. టోర్నీలో గెలిచిన విజేత జట్టుకే అప్పగించాలి’ అని రాజీవ్ శుక్లా గట్టిగానే స్పష్టం చేశారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఏజీఎంలో ఇంత జరుగుతున్నా... భారత్ నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వెల్లువెత్తుతున్నా... ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ మాత్రం ఇంకా తన మొండి పట్టు వీడటం లేదు. ట్రోఫీని ఇచ్చేందుకు సమావేశంలో అంగీకరించలేదని తెలిసింది.ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని నఖ్వీ దాటవేశారు. ఏసీసీ ఎజెండాలోని వైస్ చైర్మన్ ఎన్నిక వరకే ఈ మీటింగ్‌ను పరిమితం చేయాలని చూశారు. అంతేకాదు. వెస్టిండీస్‌పై నేపాల్ సంచలన విజయం పట్ల నేపాల్ జట్టును అభినందించారు. నేపాల్ ఆసియా జట్టు కావొచ్చు. కానీ ఆ ద్వైపాక్షిక సిరీస్ ఏసీసీకి సంబంధించిన టోర్నీ కానేకాదు. అయినా నేపాల్‌ను ప్రశంసించిన నఖ్వీ... ఏసీసీ సొంత టోర్నీ అయిన ఆసియా కప్ గెలిచిన భారత్‌ను మాటమాత్రంగానైనా అభినందించకుండా తన కుటిల బుద్ధిని చాటుకున్నారు. మొత్తానికి ఆసియా కప్ ట్రోఫీ మాత్రం ఇంకా ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. -
BCCI: కీలక పదవుల భర్తీకి సన్నాహకాలు
బోర్డులో ఇటీవల ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ముంబైలో వచ్చే నెల 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్‌జీఎమ్) ఏర్పాటు చేసింది. బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వెళ్లారు.మరోవైపు.. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బోర్డు నియమావళి ప్రకారం ఏదైన పదవి ఖాళీ అయితే 45 రోజుల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్‌జీఎమ్ నిర్వహించాలి.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో జనవరి 12న ఎస్‌జీఎమ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారమిచ్చినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా మరో ఏడాది పదవీకాలం మిగిలున్నప్పటికీ జై షా, ఆశిష్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అస్సామ్కు చెందిన బోర్డు సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉండగా, కోశాధికారి పదవి బాధ్యతల్ని ఎవరికీ కట్టబెట్టలేదు. చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
బీసీసీఐలో మరో పోస్ట్ ఖాళీ
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో మరో కీలక పదవి ఖాళీ అయ్యింది. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో చేరారు. ఆదివారం ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్రికెట్ బోర్డులోని తన కోశాధికారి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం 2022 అక్టోబర్‌లో బీసీసీఐ కోశాధికారిగా షెలార్ ఎన్నికయ్యారు.గత నెల మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా... భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ముంబై సబర్బన్ జిల్లా పరిధిలోని వాంద్రే వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆశిష్ షెలార్ ఎన్నికయ్యారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులెవరూ బోర్డు కార్యవర్గంలో ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. 2016లో ఏర్పాటైన జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే 2022లో ఎమ్మెల్యే, ఎంపీలకు మినహాయింపునిస్తూ కేబినెట్ హోదా ఉన్న వారిని అనర్హులని తీసుకొచి్చన సవరణకు సుప్రీం ఆమోదం తెలపడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్న షెలార్ కోశాధికారిగానూ పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కావడంతో బోర్డు పదవికి రాజీనామా చేశారు. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి కూడా ఖాళీ అయ్యింది. ఇప్పుడు కీలకమైన కార్యదర్శి, కోశాధికారి పదవులు రెండూ ఖాళీగా ఉన్నాయి. అయితే జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రస్తుతానికి తాత్కాలిక కార్యదర్శిగా పని చేస్తున్నారు. -
మహారాష్ట్రలో ‘ఢిల్లీ’ ప్రకంపనలు
- ఉద్ధవ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ - ప్రభుత్వం నుంచి వైదొలగి విమర్శించాలన్న ఆశిష్ శేలార్ - ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొడితే శివసేనకు మద్దతిస్తామన్న ఎన్సీపీ సాక్షి, ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోదీ అలల కంటే ఆప్ సునామీ గొప్పదని వ్యాఖ్యానించిన శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ మండిపడింది. ఢిల్లీ ఓటమితో క్రుంగిపోయిన రాష్ట్ర నేతలకు ఉద్ధవ్ వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టు చేశాయి. దీంతో ధైర్యముంటే ముందు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి విమర్శలు చేయాలని ఉద్ధవ్‌కు సవాల్ విసిరారు. సందులో సడేమియాలా వెంటనే అందుకున్న ఎన్సీపీ, ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొట్టేందుకు శివసేనకు మద్దతివ్వగలమని ప్రకటించింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై అటు ప్రత్యర్థి పార్టీలతో పాటు ఇటు భాగస్వామ్య పక్షాలు కూడా లోలోన సంతోషిస్తున్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు సంధిస్తోంది. దాదాపు పాతికేళ్ల పాటు కొనసాగిన వీరి మైత్రి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగిపోయిన సంగతి తెల్సిందే. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం రెండు పార్టీలు తిరిగి జత కట్టినప్పటికీ శివసేన తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు వెళ్లగక్కుతూనే ఉంది. దేశమంతటా నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందన్న అహంకారంతో బీజేపీ తమను చిన్నచూపుచూస్తోందన్న భావన సేన నేతల్లో నెలకొంది. దీంతో అవకాశం దొరికినప్పుడుల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ‘మోదీ అలల కంటే సునామీ ప్రభావం అధికంగా ఉంటుంది’ అన్న ఉద్ధవ్ వ్యాఖ్యలు ఆయనకు బీజేపీపై ఉన్న అక్కసును వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ వైపు నుంచి కూడా ధీటైన సమాధానం వచ్చింది. ధైర్యముంటే ముందు ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లి విమర్శించాలని బీజేపీ ముంబై నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్ సవాల్ విసిరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొట్టేందుకు తాము శివసేనకు మద్దతునిస్తామని ప్రకటించారు. దీంతో మంగళవారం సాయంత్రం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శివసేన మద్దతుతో మైనారిటీ సర్కారును నడుపుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతకాలం అధికారంలో ఉండగలరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మాలిక్ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ నుంచి, అటు శివసేన నుంచి ప్రతిస్పందన వ్యక్తం కాలేదు. -
మాజీలకు మరోసారి ఆహ్వానం
సాక్షి, ముంబై: పలు కారణాలవల్ల పార్టీని వదిలి బయటకు వెళ్లిన పదాధికారులు, కార్యకర్తలను తిరిగి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని మరిం త బలోపేతం చేయడంతో భాగంగా మాజీ సీనియర్లను అక్కున చేర్చుకునేందుకు ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల పార్టీ కొందరు నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకుంది. కొందరు నాయకులు, కార్పొరేటర్లను పార్టీ నుంచి వెలివేశారు. అలకలు, విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలన్నింటినీ మర్చిపోయి తిరిగి సొంత గూటిలోకి చేరుకోవాలంటూ బీజేపీ మాజీలకు సూచిస్తోంది. మాజీ కార్పొరేటర్ పరాగ్ అల్వాణి, మాజీ మహిళ కార్పొరేటర్ జయశ్రీ ఖరాత్, భాండుప్ బీజేపీ పదాధికారి బాబూ శింగరే తదితరులు పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించారు. వీరితోపాటు చర్యలు తీసుకున్న కార్యకర్తలనూ తిరిగి చేర్చుకుంటామని బీజేపీ ముంబై అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశిష్ శేలార్ ప్రకటించారు. పరాగ్ అల్వాణి భార్య జ్యోతి అల్వాణి గత ఎన్నికల్లో విలేపార్లే నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి గెలిచారు. అయితే శేలార్ ఆహ్వానాన్ని ఆమె కూడా అంగీకరించి పార్టీలో చేరారు. ఇలా పార్టీ నుంచి దూరమైన అందరినీ తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీకి చెందిన వారితోపాటు ఇతర పార్టీల కార్పొరేటర్లు, నాయకులను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేందుకు వివిధ ప్రణాళికలు రూపొం దిస్తున్నామని శేలార్ చెప్పారు.


