 
													హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ శెలార్ శుక్రవారం భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్‌లో వీరి సమావేశం జరిగింది. సినిమా పరిశ్రమ (Film Industry) అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, రాచకొండ లాంటి ప్రాంతాలు సినిమా షూటింగ్స్‌కుు ఎంతో అనువైనవి మహారాష్ట్ర మంత్రికి కోమటిరెడ్డి వివరించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలు నిర్మిస్తారని,హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాలు సినిమాలు నిర్మించేందుకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్‌గా డెవలప్మెంట్ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) వివరించారు. సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సినీకార్మికుల సంక్షేమం లాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
కోమటిరెడ్డికి శెలార్ ఆహ్వానం
సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, మహారాష్ట్రలో కూడా ఇట్లాంటివి అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు ఆశిష్ శెలార్ (Ashish Shelar) వెల్లడించారు. మహారాష్ట్ర ఫిల్మ్ సిటీని సందర్శించాలని మంత్రి కోమటి రెడ్డిని ఆశిష్ శెలార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
