 
													సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు అదిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అలాగే.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కేబినెట్ బెర్త్ ఆశించారు. అయితే బదులుగా ఆయనకు సలహాదారు పదవి కట్టబెడుతూ ఆరు గ్యారెంటీల అమలు బాధత్యను అప్పగించింది రేవంత్ ప్రభుత్వం. అలాగే.. ప్రేమ్‌సాగర్‌రావు కూడా కేబినెట్ అవకాశం కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే.. కేబినెట్ ర్యాంకు హోదాలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌ను కేటాయించింది. ఆశావహుల జాబితా నుంచి ఈ ఇద్దరూ అవుట్ కావడంతో మంత్రి వర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యం, సామాజిక వర్గాల ప్రాధాన్యతను కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రాజగోపాల్‌కు?
ఇదిలా ఉంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో బెర్త్ దక్కుతుందా? అనే ఆయన వర్గీయులు ఎదురు చూస్తున్నారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
