
ఆసియా టీ20 కప్-2025 ట్రోఫీ ఇంత వరకు టీమిండియాకు అందనే లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఆసియా క్రికెట్ మండలి (ACC) చైర్మన్ మొహ్సిన్ నక్వీ మొండి వైఖరి ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నక్వీకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
తీవ్ర పరిణామాలు
ట్రోఫీ గనుక టీమిండియాకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ నక్వీకి అధికారికంగా ఇ- మెయిల్ పంపినట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఒకవేళ నక్వీ గనుక తమకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకుంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని ఆశ్రయిస్తామని చెప్పినట్లు తెలిపింది.
అదే జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని హెచ్చరించామని.. వీలైనంత త్వరగా ట్రోఫీ పంపించాలని మెయిల్ రాసినట్లు పేర్కొంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
టీమిండియా నిరాకరణ
లీగ్, సూపర్-4 దశల్లో పరాజయమన్నదే ఎరుగక ఫైనల్ చేరిన సూర్యకుమార్ సేన.. టైటిల్ పోరు (సెప్టెంబరు 28)లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న నక్వీ నుంచి కప్ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు.. నక్వీ మాత్రం పట్టువీడలేదు. ట్రోఫీ, మెడల్స్ తీసుకుని హోటల్‌కు పారిపోయాడు.
పద్ధతి ప్రకారమే
తన చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ తీసుకోవాలని.. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా ట్రోఫీ ఇవ్వొద్దని నక్వీ ఏసీసీ ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంది. పద్ధతి ప్రకారమే ట్రోఫీని తమ వద్దకు రప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తోంది.
పూర్తి స్పృహలో ఉండే
కాగా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా నిరాకరించడానికి గల కారణాన్ని సైకియా గతంలో వెల్లడించాడు. ‘‘ఏసీసీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు.
ఉగ్రదాడికి నిరసనగా
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. దీంతో రచ్చకెక్కిన పీసీబీ.. అతి చేసింది.
ఇందుకు అనుగుణంగానే పాక్ ఆటగాళ్లు హ్యారిస్ రవూఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి.. ఐసీసీతో చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ఫైనల్లో దాయాది చేతిలో ఓడి ఇంటిబాట పట్టగా.. పీసీబీ చైర్మన్ నక్వీ ఇలా మెడల్స్, ట్రోఫీ ఎత్తుకెళ్లడం గమనార్హం.
చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్