
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చిందులు
పెను వివాదం రాజేస్తోన్న పీసీబీ
టీమిండియాను సమర్థించిన బీసీసీఐ
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్‌లో, ఫుట్‌బాల్‌లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది.
మ్యాచ్ రిఫరీని తొలగించండి
మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్‌ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్‌గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్‌గా భారత్‌కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.
‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్‌తో షేక్‌హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు.
తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!
పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్‌లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్‌లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్‌తో ఆడం, మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.
గతంలో... టెన్నిస్‌లో...
ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్‌లో షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్స్ కనిపించవు.

అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి
పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్‌మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్‌దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్‌లో లేదు. ఇది పూర్తిగా గుడ్‌విల్‌తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు.